కరోనా రోగులకు చికిత్స అందించే వైద్యులు పీపీఈ కిట్లను ఉపయోగించడం అత్యవసరం. అయితే వీటిని ధరించే సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో.. తొలగించే సమయంలోనూ అంతే జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ క్రమంలోనే చెంగల్ పట్టు ప్రభుత్వ ఆసుపత్రి(సీజీఎమ్సీ)తో కలిసి పీపీఈలను సురక్షితంగా తొలగించే 'డాఫింగ్ యూనిట్ల'ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఐఐటీ మద్రాసు.
ఐఐటీ సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కోషి వర్గీస్, ప్రొఫెసర్ అరుల్ జయచంద్రన్.. సీజీఎమ్సీ ఇన్నోవేషన్ బృందంతో కలిసి ఈ డాఫింగ్ యూనిట్‌ను రూపొందించారు. లాక్డౌన్ విధించిన తర్వాత ఏప్రిల్ నెలలో ఈ రూపకల్పనకు శ్రీకారం చుట్టారు.
డాఫింగ్ అంటే ఏంటి?
పీపీఈలను వైద్యులు సురక్షితంగా ధరించే విధానాన్ని 'డోనింగ్' అంటారు. వీటిని తొలగించే పద్ధతిని 'డాఫింగ్' అని పిలుస్తారు. కరోనా వంటి ప్రమాదరమైన వైరస్లు వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ఇంటువంటి ప్రామాణిక ప్రోటోకాల్స్ అనివార్యం.
కరోనా రోగులకు చికిత్స అందించే ఆసుపత్రుల్లో పీపీఈ కిట్ల కోసం డోనింగ్, డాఫింగ్ యూనిట్లు ఎంతో అవసరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే పీపీఈ వినియోగంపై కొన్ని ప్రమాణాలను నిర్దేశించింది. పీపీఈలను ధరించి, తొలగించే సమయంలో అనుసరించాల్సిన విధానాలనూ సూచించింది.
'నమ్మకంతో ఇంటికెళ్తాం...'
ఎన్నో నమూనాలను రూపొందించి వాటిని పరిశీలించిన తర్వాత.. నిపుణులు డాఫింగ్ యూనిట్‌ను ఖరారు చేశారు. ఈ పరికరాలు ఎంతో సురక్షింతగా, సమర్థంగా పని చేస్తాయని నిర్ధరణ అయ్యాయి. డాఫింగ్ యూనిట్ల వినియోగం ద్వారా వైరస్‌ను ఇంటివరకు తీసుకెళ్తామనే భయం ఇకపై ఉండదని అంటున్నారు వైద్యులు.