దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వైరస్ అనుమానితులకు పరీక్షలు చేయడానికి కావాల్సిన సదుపాయాలు అందుబాటులో ఉండటం లేదు. ఈ క్రమంలోనే గుజరాత్‌లోని గాంధీనగర్‌కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) పరిశోధకులు కొవిడ్‌ను కనుగొనడం కోసం వినూత్న ఆవిష్కరణ చేపట్టారు. ఛాతీ ఎక్స్-రే నుంచి కరోనాను గుర్తించే విధంగా కృత్రిమ మేధస్సుతో కూడిన సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు.
ఎవరైనా కరోనా బారిన పడినట్లు అనిపిస్తే.. వైద్య పరీక్షకు ముందు ప్రాథమిక నిర్ధరణ కోసం ఈ ఆన్లైన్ యంత్రాన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం దీనిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(ఐఐపీహెచ్) పరీక్షిస్తోంది. కరోనా నిర్ధరణ సదుపాయాలు పరిమితంగా ఉన్నందున.. ఇటువంటి సాంకేతికత ఎంతో అవసరమని పరిశోధకులు చెబుతున్నారు.
ఎలా పని చేస్తుంది...?
కరోనా సోకిన వ్యక్తుల ఛాతీకి ఎక్స్‌రే తీసి, దానిని కంప్యూటర్ ద్వారా విశ్లేషిస్తే ఫలితాలు ఉంటాయని అంచనా వేసి.. అందుకు తగ్గ కంప్యూటర్ ప్రోగ్రాంను రూపొందించారు. సునిశిత అధ్యయన పరికరం(డీప్ లెర్నింగ్ టూల్) పేరుతో ఓ చిన్న యంత్రాన్ని తయారు చేశారు. ఇది కృత్రిమ మేధ ఆధారంగా పనిచేస్తుంది. వైద్య సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చి, అందరికీ అందుబాటులోకి తీసుకురావచ్చని చెబుతున్నారు.
"మేము ఉపయోగించిన మోడల్లో 12 పొరల న్యూరల్ నెట్వర్క్ ఉంది. ఇవి మానవుని మెదడులోని 12 పొరల్లో నాడీ వ్యవస్థకు సరితూగుతుంది. ఎక్స్‌రే చిత్రాల నుంచి కొవిడ్ లక్షణాలను ఆటోమేటిక్ పద్దతిలో గుర్తించే విధంగా ఈ యంత్రం రూపొందింది. వీటితో పాటు, ఊపిరితిత్తుల సమస్యలైన క్షయ, న్యుమోనియా వంటి వ్యాధులకు సంబంధించిన ఎక్స్ రేల ద్వారా కొవిడ్‌ను గుర్తించేందుకు సాయపడుతుంది."
-కుష్పాల్ సింగ్ యాదవ్, ఐఐటీ విద్యార్థి, పరిశోధన బృంద నాయకుడు
ఇటీవలే అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు కరోనాను గుర్తించే కృత్రిమ మేధస్సుతో కూడిన సాంకేతికతను ముందుకు తీసుకొచ్చారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాటితో పోలిస్తే.. ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం అత్యాధునికమైందని ఐఐటీ ప్రొఫెసర్ కృష్ణ ప్రసాద్ అంటున్నారు.
ఇదీ చూడండి:'పెట్రో ధరల పేరిట కేంద్రం బలవంతపు వసూళ్లు'