దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు భారీగా బయటపడుతుండటం వల్ల పరీక్షలు కూడా భారీ సంఖ్యలో అనివార్యమయ్యాయి. దేశంలో ఇప్పటివరకు కొవిడ్-19 నిర్ధరణ కోసం ఎక్కువగా ఆర్‌టీ-పీసీఆర్ విధానాన్ని అనుసరిస్తున్నారు. అయితే, తాజాగా యాంటిజెన్ టెస్ట్‌కిట్ ఫలితాలను కూడా భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), ఎయిమ్స్ ధ్రువీకరించాయి. వీటికి సంబంధించిన తాజా మార్గదర్శకాలను ఐసీఎంఆర్ విడుదల చేసింది.
దక్షిణ కొరియాకు చెందిన ఈ యాంటిజెన్ టెస్ట్ కిట్ ద్వారా కేవలం 30నిమిషాల్లోనే ఫలితం తేలనుంది. అయితే, ఈ విధానంలో పాజిటివ్ వస్తే మాత్రం దాన్ని పాజిటివ్ కేసుగానే పరిగణిస్తారు. తిరిగి రెండోసారి పరీక్షించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫలితం నెగెటివ్ వస్తే మాత్రం నిర్ధరణ కోసం మళ్లీ ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష చేసి ధ్రువీకరించుకోవాలని ఐసీఎంఆర్ తాజా మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తులకు దీని ద్వారా పరీక్షిస్తే ఫలితం చాలా తొందరగా వెలువడే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, గడచిన 24గంటల్లో దేశంలో 1,15,519 శాంపిళ్లను ఐసీఎంఆర్ పరీక్షించింది. దీంతో దేశంలో ఇప్పటివరకు 57,74,133 శాంపిళ్లకు కొవిడ్-19 నిర్ధరణ పరీక్షలు జరిపినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.
ఇదీ చూడండి:మరో ముప్పు: భారత్‌పై అగ్గి పిడుగు!