ఐఏఎస్ అధికారిగా రాజీనామా చేసి, రాజకీయాల్లోకి వెళ్లిన వ్యక్తి... మళ్లీ అదే ఉద్యోగంలో తిరిగి చేరడం సాధ్యమేనా? జమ్ముకశ్మీర్‌కు చెందిన షా ఫైజల్ వ్యవహారం చూస్తే ఔననే అనిపిస్తోంది. గతేడాది ఫైజల్ ఇచ్చిన రాజీనామా లేఖను ఇంకా ఆమోదించలేదని ప్రభుత్వం చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ట్విట్టర్ బయో మార్పుతో...
ఎన్నో ఏళ్ల పాటు జమ్ముకశ్మీర్ ప్రభుత్వంలో సేవలు అందించిన ఐఏఎస్ అధికారి షా ఫైజల్ గతేడాది విధుల నుంచి తప్పుకున్నారు. 2019 ఆరంభంలో రాజకీయ అరంగేట్రం చేసి... జమ్ముకశ్మీర్ పీపుల్స్ మూవ్మెంట్(జేకేపీఎమ్)ను స్థాపించారు. కశ్మీర్ యువతకు జేకేపీఎమ్ ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా నిలుస్తుందని పదేపదే చెప్పారు. అయితే రాజకీయాల్లో ఆయన విజయం సాధించలేకపోయారు.
జేకేపీఎమ్ను ఏర్పాటు చేసినప్పటికీ.. ఇన్ని నెలలుగా ఫైజల్ పేరు ప్రభుత్వ అధికారిక వైబ్‌సైట్‌లోని ఐఏఎస్ అధికారుల జాబితాలో కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో ఆయన రాజీనామాను ఆమోదించలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆయన తిరిగి విధుల్లో చేరవచ్చని సంకేతాలిచ్చాయి. ఈ వార్తలకు ఊతమందిస్తూ తన ట్విట్టర్ బయోను పూర్తిగా మార్చేశారు ఫైజల్. జేకేపీఎమ్ వ్యవస్థాపకుడన్న విషయాన్ని డిలీట్ చేశారు.
ఐఏఎస్‌గా మంచి పేరు
2010లో సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి సొంత రాష్ట్రంలో పోస్టింగ్ పొందారు ఫైజల్. నిజాయితీపరుడిగా పేరు సంపాదించారు.
ఆర్టికల్ 370 రద్దు సమయంలో కశ్మీర్‌లోని అనేకమంది నేతలతో పాటు ఫైజల్‌ను కూడా ప్రజా భద్రత చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో విముక్తి పొందారు ఫైజల్.
ఇదీ చూడండి:- జమ్ముకశ్మీర్ ప్రజల భూమి హక్కులపై బిల్లు!