భారత వాయుసేన తొలి మహిళా అధికారి, వింగ్ కమాండర్ (రిటైర్డ్) డాక్టర్ విజయలక్ష్మీ రమణన్(96) కన్నుమూశారు. బెంగళూరులోని తన కుమార్తె నివాసంలో ఉంటున్న ఆమె.. ఆదివారం తుదిశ్వాస విడిచినట్లు ఆమె అల్లుడు ఎస్ఎల్వీ నారాయణ్ తెలిపారు.
విజయలక్ష్మీ రమణన్ 1924 ఫిబ్రవరిలో జన్మించారు. ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 1955 ఆగస్టు 22న సైనిక వైద్య విభాగంలో నియమితులయ్యారు. అదే రోజు వాయుసేనలోకి వెళ్లారు. వాయుసేనకు చెందిన వివిధ ఆసుపత్రుల్లో గైనకాలజిస్ట్‌గా సేవలందించిన ఆమె.. యుద్ధాల సమయంలో గాయపడిన సైనికులకూ వైద్యం చేశారు. అలాగే కార్యనిర్వాహక విధులనూ నిర్వర్తించారు.
1972 ఆగస్టులో వింగ్ కమాండర్ ర్యాంకుకు పదోన్నతి పొందారు రమణన్. ఐదేళ్ల తర్వాత విశిష్ట సేవా మెడల్ అందుకున్నారు. 1979 ఫిబ్రవరిలో పదవీ విరమణ చేశారు.
ఆమె భర్త కేవీ రమణన్ కూడా వాయుసేనలో సేవలందించారు. వారికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. యుక్త వయసులో ఆల్ ఇండియా రేడియోలో ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రమణన్.
ఇదీ చూడండి: తమిళ విద్యార్థుల బుల్లి శాటిలైట్‌కు నాసా ఫిదా