ఫిబ్రవరి 27న పాక్ విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన ఘటనలో వాటిలోని ఎఫ్-16 విమానాన్ని కూల్చివేశామని స్పష్టం చేసింది భారత వైమానిక దళం. ఆ ఘటనలో ఎఫ్-16 విమానం కూలలేదని, పాక్ వద్ద ఉన్న అన్ని ఎఫ్-16 విమానాలు క్షేమంగా ఉన్నాయన్న అమెరికా పత్రిక కథనంపై స్పందించింది. ఎఫ్-16 కూలినట్టు తమ వద్ద ఆధారాలున్నాయని, శకలాల్ని సైతం సేకరించినట్లు పేర్కొంది భారత వైమానిక దళం.
"సరిహద్దును రక్షించే క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16ను భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 బైసన్ ఎయిర్‌క్రాఫ్ట్.. నౌషేరా సెక్టార్లో కూల్చింది" -భారత వైమానిక దళం
వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఈ ఎఫ్-16ను కూల్చినట్లు వెల్లడించింది. పాకిస్థాన్ రేడియో కమ్యూనికేషన్లు సైతం ఈ విషయాన్ని నిర్ధరించినట్లు పేర్కొంది. రెండు వేరు వేరు చోట్ల నుంచి క్షిపణులను విడుదల చేసిందని వెల్లడించింది భారత వైమానిక దళం.
అమెరికా పత్రిక కథనం...
ఎఫ్-16 యుద్ధ విమానాన్ని భారత్ కూల్చలేదన్న పాకిస్థాన్ వాదనలకు బలం చేకూరేలా అమెరికాకు చెందిన 'ఫారిన్ పాలసీ మ్యాగజైన్' ఓ కథనం ప్రచురించింది. రక్షణ ఒప్పందంలో భాగంగా పాక్‌కు అమెరికా అందించిన ఎఫ్-16 యుద్ధ విమానాలన్నీ సురక్షితంగానే ఉన్నాయని కథనంలో పేర్కొంది. అమెరికా రక్షణ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి దీన్ని ధ్రువీకరించారని తెలిపింది.
ఇదీ జరిగింది...
ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడికి భారత్ ధీటుగా బదులిచ్చింది. బాలాకోట్‌లోని పాక్ ఉగ్ర శిబిరాలను వైమానిక దాడులతో నేలమట్టం చేసింది.
భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా దాడికి యత్నించిన పాక్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూడా ధ్వంసం చేసినట్టు ఫిబ్రవరి 28న రక్షణ అధికారులు ప్రకటించారు.