ఈ ఎన్నికల్లో రెండు లోక్‌సభ స్థానాల్లోనూ రాహుల్ గాంధీ ఓడిపోతారని, 2024 ఎన్నికల నాటికి పక్క దేశాల్లోని ఓ సీటును ఆయన వెతుక్కోవాల్సిందేనని ఎద్దేవా చేశారు కేంద్ర మంత్రి పియూష్ గోయల్. ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ, కేరళలోని వయనాడ్ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు రాహుల్.
వయనాడ్‌లో పోటీ చేస్తూ తన ప్రత్యర్థిగా ఉన్న వామపక్ష అభ్యర్థికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం రాహుల్ గాంధీకి లేదని విమర్శించారు పియూష్.
" సీతారాం ఏచూరితో రాహుల్ దిగిన చాలా ఫొటోలను చూశాం. అమేఠీలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోతాననే భయంతోనే రాహుల్ వయనాడ్ స్థానంలో పోటీకి వెళ్లారు. వామపక్షాలపై ఆయన పోటీ చేస్తున్నారు. కానీ నేను వాళ్లను విమర్శించబోనని రాహుల్ చెబుతున్నారు. ఆయన భయపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రత్యర్థికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు కూడా ధైర్యం లేని వారు దేశానికి సేవ చేయలేరు. అమేఠీలో రాహుల్‌ను స్మృతి ఇరానీ ఓడిస్తారు. వయనాడ్‌లోనూ ఆయన పరాజయం చెందుతారు. వచ్చే ఎన్నికల కోసం సీటు వెతుక్కోవడానికి రాహుల్ పక్క దేశానికి వెళ్లాల్సి వస్తుంది."
- పియూష్ గోయల్, కేంద్ర మంత్రి
బయటికే వారి ఐక్యత
ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ పొత్తుపైనా స్పందించారు పియూష్ గోయల్.
"చివరి ఆరు నెలల్లో ఎస్పీ-బీఎస్పీ నేతలు కరచాలనం చేసుకున్న ఫొటోలు వందల్లో చూపిస్తా. కొన్నిసార్లు కలిసి ఉంటారు. కొన్నిసార్లు విమర్శించుకుంటారు, తిట్టుకుంటారు. వేదికల మీద మాత్రం ఆ రెండు పార్టీల వారు చేతులు కలుపుతారు. వేదిక దిగితే అభిప్రాయాలను పూర్తిగా మార్చుకుంటారు."
- పియూష్ గోయల్, కేంద్ర మంత్రి