దేశంలో మనుషులపై కొవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి రంగం సిద్ధమైనట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. సుమారు 1000మంది వాలంటీర్లు ఈ ట్రయల్స్‌లో పాల్గొంటారని స్పష్టం చేసింది.
"దేశీయంగా అభివృద్ధి చేసిన రెండు కరోనా టీకాలపై.. ఇప్పుడు హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ జరగనున్నాయి."
- ఐసీఎంఆర్.
ప్రక్రియ వేగవంతం
'ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తిదారుగా భారత్ ఉంది. కరోనా వైరస్ సంక్రమణను నియంత్రించే వ్యాక్సిన్ అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది' అని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ వెల్లడించారు.
డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) రెండు వ్యాక్సిన్లను మానవులపై ప్రయోగించేందుకు అనుమతి ఇచ్చింది. అవి
- ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్.
- జైదాస్ కాడిలా హెల్త్‌కేర్ లిమిటెడ్ రూపొందించిన కొవిడ్ టీకా. ఇది మొదటి, రెండో దశ మానవ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి పొందింది.
విజయవంతంగా..
'ఈ రెండు వ్యాక్సిన్లు.. ఎలుకలు, కుందేళ్లపై చేసిన క్లినికల్ ట్రయల్స్‌లో విజయవంతమయ్యాయి. దీనితో మానవులపై ప్రయోగాలు(క్లినికల్ ట్రయల్స్) చేసేందుకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది' అని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ పేర్కొన్నారు.
ఈ రెండు టీకాలపై వేర్వేరుగా హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయని బలరామ్ భార్గవ స్పష్టం చేశారు. ఇందులో విడివిడిగా సుమారు 1000మంది పాల్గొంటారని వెల్లడించారు.
ఇదీ చూడండి: నేడు 15వ 'భారత్-ఈయూ' సదస్సు.. మోదీ హాజరు