ఓ పక్క గల్వాన్ లోయలో చైనా భారీ స్థాయిలో సైన్యాన్ని దించుతున్నా.. భారత దళాలు ఏమాత్రం భయంలేకుండా నిశ్చింతగా ఉన్నాయి. యుద్ధ రంగంలో ఆయుధ సామర్థ్యాన్ని లెక్కగట్టడానికి ఓ కాన్సెప్ట్‌ను బలంగా పరిగణనలోకి తీసుకొంటారు. అదే 'కాంబాట్ ప్రూవెన్'. అంటే.. యుద్ధాల్లో పాల్గొని.. శక్తిసామర్థ్యాలు నిరూపించుకోవడం. ఇప్పుడు మనం కొనుగోలు చేస్తున్న రఫెల్ అయినా.. ఇప్పటికే కొనుగోలు చేసిన అపాచీ హెలికాప్టర్లైనా ఇలాంటివే. నిరూపించుకోవడం అనే అంశం దళాలకు కూడా వర్తిస్తుంది. ఈ విషయంలో చైనా కంటే భారత దళాలకు అనుభవం ఎక్కువ. నిత్యం కశ్మీర్ పర్వత సానువుల్లో ఉగ్రవాదులు, పాక్‌కు చెందిన 'బోర్డర్ యాక్షన్ టీమ్'లతో మన వాళ్లు తలపడుతుంటారు. ఈ నేపథ్యంలో పర్వత యుద్ధతంత్రలో ప్రపంచంలోనే అత్యుత్తమైన దళం భారత్ వద్ద ఉంది. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు.. సాక్షాత్తూ చైనా సైనిక నిపుణుడు హువాగ్ గ్వాజీ.
1962, 67ల్లో చైనా తీరును చూసిన భారత్ 1970 నుంచి పర్వత యుద్ధతంత్రంపై దృష్టిపెట్టింది. భారత్, పాక్, మయన్మార్ సరిహద్దుల్లో పర్వత ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి నుంచే శత్రుదళాలు, ముష్కరులు దేశంలోకి చొరబడుతుంటారు. దీంతో భారత దళాలు పర్వతాలపై పట్టు సాధించడంపై దృష్టిపెట్టాయి. భారీ సంఖ్యలో సైనికులకు పర్వత యుద్ధతంత్రపై శిక్షణ ఇచ్చింది. మన బలగాల్లో అత్యధిక మంది సర్వీసు కూడా పర్వతాలపైనే ఉంటోంది. మౌంటేన్ స్ట్రైక్ గ్రూప్‌ను ఏర్పాటు చేయడంపై కూడా దృష్టిపెట్టింది.
ఓ అంచనా ప్రకారం భారత్ వద్ద దాదాపు 12 డివిజన్లతో 2,00,000 మంది పర్వత యుద్ధతంత్ర నిపుణులు ఉన్నారు. వీరికి పారామిలటరీ సిబ్బంది అదనం. పారామిలటరీ కూడా ఇప్పటికే పలు చోట్ల పర్వత కనుమలకు పహారా బాధ్యతలు నిర్వహిస్తోంది. ప్రపంచలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్‌లో పనిచేసిన అనుభవం మన సైనికుల సొంతం. అక్కడ కనీసం ఆరువేల మంది సిబ్బంది నిత్యం పహారా కాస్తుంటారు.
భారత్‌కు జమ్ము సమీపంలో హై ఆల్టిట్యూడ్ మౌంటెన్ వార్‌ఫేర్ స్కూల్ కూడా ఉంది. ప్రపంచ అత్యున్నత యుద్ధతంత్ర శిక్షణ కేంద్రాల్లో ఇది కూడా ఒకటి. చాలా మిత్రదేశాలకు చెందిన దళాలు ఇక్కడ శిక్షణ పొందడానికి వస్తాయి. వీటిల్లో అమెరికా, రష్యా, యుకే వంటి అగ్రరాజ్యాలు కూడా ఉన్నాయి. దళాలకు పర్వత ప్రాంతాలకు తగ్గట్లు శారీరకంగా తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. దీనికి అదనంగా కార్గిల్ బ్యాటిల్ స్కూల్‌ను కూడా ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తోంది. ఇటువంటి శిక్షణ, వ్యూహాల కారణంగా పాక్‌కు కశ్మీర్ సరిహద్దుల్లో మనవాళ్లు గట్టిగా సమాధానం చెప్పగలుగుతున్నారు. ముఖ్యంగా కార్గిల్ పాఠాలు మనవాళ్లకు ఇప్పుడు ఉపయోగపడనున్నాయి.
వాస్తవాధీన రేఖకు చేరిన బృందాలు..
వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద చైనా దళాలు కవ్వింపు చర్యలు చేపడుతుండటం వల్ల భారత్ కూడా పర్వత యుద్ధతంత్ర నిపుణులను రంగంలోకి దింపింది. 3,488 కిలోమీటర్ల సరిహద్దులో వీటిని మోహరించింది. ఇక్కడకు చైనా సైన్యం ఇప్పటికే ట్యాంకులను తరలించింది. కానీ, పర్వతాలపై వాటి కదలికలు పెద్ద సమస్యగా మారతాయి. మరోపక్క భారత దళాలు గెరిల్లా యుద్ధతంత్రలో ఆరితేరడం వల్ల చైనాకు ఆందోళనకరంగా మారింది. చిన్న బృందాలుగా మారి పర్వత శిఖరాల్లో దాక్కొని పోరాడటం వీరి ప్రత్యేకత. ఇలాంటి చోట్ల సూదిమొనను కూడా కొట్టగలిగేంత కచ్చితత్వంతో చైనా శతఘ్నులు, క్షిపణలు పనిచేయాలి. లేకపోతే అవి కొన్ని మైళ్ల అవతలకు దూసుకుపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఓ పక్క టిబెట్ పీఠభూమిపై నుంచి వచ్చే చైనా సైన్యాలకు కే2, నందాదేవి, కాంచనగంగ, నామ్చే బార్వ వంటి శిఖరాలు సవాళ్లు విసురుతాయి. వీటికి తోడు మన మౌంటెన్ వార్‌ఫేర్ బృందాలు అక్కడకు చేరడం వల్ల చైనా అడుగు ముందుకేయాలంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.