ETV Bharat / bharat

కరోనా కాలాన పరీక్షా సమయమిది!

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ ముప్పుతిప్పలు పెడుతోంది. కాస్త ఆలస్యంగా ఈ వ్యాధిని మహమ్మారిగా గుర్తించడం వల్ల నష్ట తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మరి ఇలాంటి పరిస్థితుల నుంచి గట్టేక్కాలంటే నిపుణులు చెబుతున్న సూచనలేంటి?

corona news
కరోనా కాలాన పరీక్షా సమయమిది!
author img

By

Published : Apr 7, 2020, 7:04 AM IST

కొవిడ్‌ను మహమ్మారిగా ప్రకటించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మల్లగుల్లాలు పడినంతసేపు పట్టలేదు-అది ప్రపంచ దేశాలన్నింటినీ ఒక్కపెట్టున చుట్టేయడానికి! విశ్వవ్యాప్తంగా 13లక్షల కేసులు, 70 వేల పైచిలుకు మరణాలతో భయవిహ్వల వాతావరణం సృష్టించిన కరోనా- ఇండియాలోనూ ప్రజారోగ్యానికి పెనుసవాలు రువ్వుతోంది. 21 రోజుల లాక్‌డౌన్‌ కాలావధిలో చివరి వారం ఇదే కావడంతో దేశంలో కరోనా కట్టడి ఏ మేరకు సాధ్యపడిందో ఈ నెల 16నాటికి ఓ స్పష్టత రానుంది. భారత్‌లో తొలి అయిదు వందల కేసులు నమోదు కావడానికి 55 రోజులు పడితే, 3,500 కేసులకు మరో 500 జతపడటానికి కేవలం ఒక్క రోజే పట్టడం- పరిస్థితి ప్రమాదకరంగానే ఉందని నిర్ధారిస్తోంది. రోగ లక్షణాలున్నవారందర్నీ జాగ్రత్తగా పరీక్షిస్తే కరోనా వ్యాప్తి వాస్తవ చిత్రం ప్రస్ఫుటమవుతుందన్న నిపుణుల సూచనలు ఏ మాత్రం తోసిపుచ్చలేనివి. కరోనా వైరస్‌ నిర్ధారణ కిట్లు పరిమితంగా ఉండటం వల్ల విదేశాల నుంచి వచ్చినవారిలో రోగలక్షణాలు కనిపించినవారికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇచ్చింది. కరోనా విజృంభణ నాలుగు దశల్లో సాగుతుందన్న అవగాహనతో- విదేశాల నుంచి వచ్చినవారితో పాటు వారి సన్నిహితుల్నీ క్వారంటైన్‌ చేసి అవసరానుగుణంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తూ వచ్చింది. మార్చి 24న కేంద్రం ప్రకటించిన మూడు వారాల లాక్‌డౌన్‌ కరోనా వైరస్‌ గొలుసును తెగతెంచడానికి అక్కరకొస్తుందన్న అంచనాతో, ఈ వ్యవధిలో వ్యాధిపై సమగ్ర పోరాటానికి అవసరమైన వైద్యారోగ్య రక్షణ దళాల్ని సరైన సాధన సంపత్తితో సంసిద్ధం చేసేందుకు కేంద్రం ఉద్యుక్తమైంది. ఇప్పటికే కర్ణాటకలో 22 కేసులు, మహారాష్ట్రలో నమోదైనవాటిలో 11 శాతం- విదేశీ ప్రయాణాలు లేదా పరిచయస్తులకు చెందినవి కాకపోవడంతో కరోనా అంటువ్యాధిగా ప్రబలుతోందేమోనన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. వ్యాధి లక్షణాలున్న వారందర్నీ విస్తృతంగా పరీక్షించి నిర్ధారిత కేసులకు తక్షణ చికిత్స విధానమే ఇక శిరోధార్యం కావాలి!

అప్రమత్తత అవసరం..

సీజన్లవారీగా దగ్గు జలుబు జ్వరాలు ప్రపంచవ్యాప్త మానవాళికి సాధారణ రుగ్మతలు. గోముఖ వ్యాఘ్రంలా అవే లక్షణాలతో మనిషిని ఆవహించే కరోనా వైరస్‌- పౌష్టికాహార లోపంతో కుంగి, సాంక్రామికేతర వ్యాధులతో తీసుకొంటున్న బక్కప్రాణాల్ని కర్కశంగా కబళిస్తుందని చాటుతున్నాయి ఎన్నో అధ్యయనాలు! 1918నాటి స్పానిష్‌ ఫ్లూ ధోరణిని పుణికిపుచ్చుకొని చెలరేగుతున్న కరోనా పట్ల యువజనమూ అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిస్తోంది. 'అన్ని దేశాలకూ మా సందేశం ఒక్కటే- అనుమానిత కేసులన్నింటినీ పరీక్షించండి' అని మార్చి మూడోవారంలోనే సూచించింది. ఆరోగ్య సంస్థ హెచ్చరికలు వెలువడేనాటికే- 2003 నాటి ‘సార్స్‌’ అనుభవాల నుంచి నేర్చిన గుణపాఠాలతో సంసిద్ధమైన జనచైనా గత నెలాఖరు నాటికి మూడు లక్షల 20 వేలమందిని పరీక్షించింది. సార్స్‌ను గుర్తించిన హాంకాంగ్‌ బృందం దన్నుతో వ్యాధి నిర్ధారణ పరీక్ష కిట్లను కనిపెట్టి యుద్ధప్రాతిపదికన అందుబాటులోకి తెచ్చింది. సార్స్‌తో సారూప్యం ఉన్న కరోనా సృష్టించగల విలయాన్ని పసిగట్టిన బెర్లిన్‌ శాస్త్రవేత్త ఆల్‌ఫర్ట్‌ లాన్‌ దూరదృష్టితో రోగనిర్ధారణ కిట్లను అభివృద్ధి చేసిన జర్మనీ ఫిబ్రవరి చివరినాటికే 40 లక్షల కిట్లను తయారు చేసింది. వారానికి 15 లక్షల కిట్ల తయారీతో, రోజూ 30వేల పరీక్షలు నిర్వహిస్తూ కరోనా కోరలు పీకుతోంది. తొలిదశలోనే వైరస్‌ ఆచూకీ కనిపెట్టి సత్వర చికిత్స అందించడం ద్వారా ప్రాణాల్ని కాపాడే అవకాశాన్ని అందిపుచ్చుకొన్న జర్మనీ ధీమాగా ముందడుగేస్తోంది. 82 వేలకుపైగా కొవిడ్‌ కేసులు నమోదైన ఫ్రాన్స్‌లో మరణాలు ఆరున్నర వేలు దాటిపోగా, 91 వేలకు పైబడిన కేసులున్నా మృతుల సంఖ్యను 1,275కు పరిమితం చెయ్యడంలోనే జర్మనీ విజయ రహస్యం దాగుంది. దక్షిణ కొరియా వ్యూహమూ అదే. అనుమానితులందర్నీ సత్వరం పరీక్షించడం ద్వారా వారి ప్రాణాల్ని కాపాడటం, ప్రాణగండం నుంచి తక్కినవారిని రక్షించడం అన్న ఈ ద్విముఖ వ్యూహం- ఇండియాకు మరింతగా అక్కరకొచ్చేదే!

ఆగని మరణ మృదంగం..

ప్రధాని మోదీ పిలుపు మేరకు- కరోనా తిమిరాన్ని తరిమికొట్టేలా దేశవ్యాప్తంగా జ్యోతి ప్రజ్వలనం సాగిన సమయానికి మొత్తం 89,534 రోగ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి చెబుతోంది. 'ఏటా వచ్చే ఫ్లూ లాంటిదే ఇదీ' అంటూ మొదట్లో కరోనా ఉత్పాతాన్ని గుర్తించ నిరాకరించిన అమెరికా, ఇప్పుడు రోజూ లక్ష పరీక్షలు నిర్వహిస్తున్నా ఆగని మరణ మృదంగం- వ్యూహ నిర్మాణంలో ఏమరుపాటు ఏ మాత్రం కూడదని హెచ్చరిస్తోంది. ఇప్పటికే ఇండియాలో కొవిడ్‌ ప్రజ్వలన ప్రాంతాలను గుర్తించిన ప్రభుత్వం వాటిని కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ చేసి, ఆయాచోట్ల విస్తృతంగా పరీక్షలు నిర్వహించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవాలని భావిస్తోంది. ప్రభుత్వ లేబొరేటరీల్లో కరోనా పరీక్షల్ని ప్రతి మూడు రోజులకు రెట్టింపు సంఖ్యలో చేసేలా చూస్తామని, క్షయ నిర్ధారణ పరీక్షల సామగ్రిని కరోనా అనుమానితుల కోసం వినియోగిస్తామని, పావుగంటలో ఫలితం తేలే యాంటీబాడీ టెస్టుల్ని విస్తృతంగా చేపడతామని ఐసీఎమ్‌ఆర్‌ చెబుతోంది. కరోనా పరీక్షకు నాలుగున్నర వేల రూపాయల రుసుము నిర్ధారించిన ప్రభుత్వం కొన్ని ప్రైవేటు సంస్థలకు అనుమతులు ఇచ్చినా, పోనుపోను పెరిగే కేసుల ఒత్తిడికి అవి సరిపోతాయా అన్నది ప్రశ్న. వ్యాధి నిర్ధారణ పరీక్షా కేంద్రాల నెట్‌వర్క్‌ను తాలూకా స్థాయిదాకా విస్తరించి, విఖ్యాత ప్రైవేటు సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించి ఫలితాల్ని సత్వరం క్రోడీకరించే ఏర్పాట్లు జరగాలి. వచ్చే నెల తొమ్మిది నుంచి కరోనా నెమ్మదించగలదన్న ఆశాభావం మంచిదే అయినా ఈలోగా కేసుల ఉరవడికి దీటుగా పరీక్ష-చికిత్సల యంత్రాంగాన్ని యుద్ధప్రాతిపదికన కదం తొక్కించాలి!

ఇదీ చూడండి:దేశంలో 2-3 దశల మధ్య కరోనా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.