శత్రు దేశంతో యుద్ధం లేదా ఘర్షణ జరిగింది అంటే.. అది దారితీసేది ఓ భావోద్వేగపూరిత వాతావరణానికే. ఈ నెల 15న తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయ వద్ద చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీర మరణం పొందిన తర్వాత దేశంలో ఇప్పుడు అలాంటి వాతావరణమే కనిపించింది. ఇది ఓవైపు కొనసాగుతూ ఉండగానే గల్వాన్ లోయలో అసలు ఏం జరిగింది? అన్న దానిపై సందిగ్ధం నెలకొంది. అఖిలపక్ష సమావేశం నిర్వహించి సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరించినా.. విపక్షాల్లో ఎన్నో ప్రశ్నలు, తొలగని సందేహాలు. మరి అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది?
ఈ విషయంపై పలువురు సైనిక అధికారులు, నిపుణులు గల్వాన్ లోయలో వాస్తవంగా ఏం జరిగిందనే దానిపై వివరాలు అందించారు. ఘటనకు దారి తీసిన పరిస్థితులను సమగ్రంగా వివరించారు.
సాయంత్రం నుంచి రాత్రి వరకు...
తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్- చైనా సైనికుల మధ్య మే 5 నుంచి ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని పరిష్కరించుకోవడానికి ఈ నెల 6న ఇరు దేశాల సైనికాధికారుల స్థాయిలో చర్చలు జరిగాయి. ఇందులో ఓ అంగీకారం కుదిరింది.
అంత వరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే భారత్- చైనా మధ్య వివాదం ముదిరింది. దేశ సైనికాధికారులు, నిపుణులు కూడా అదే మాట చెబుతున్నారు. జూన్ 15 సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు మూడు వేర్వేరు ఘర్షణలు జరిగాయని వెల్లడించారు.
సాయంత్రం 5 గంటలకు..
సైనికాధికారులు, నిపుణులు చెబుతున్నదాని ప్రకారం.. గల్వాన్ లోయలోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ వైపు పెట్రోల్ పాయింట్ 14 వద్ద ఏర్పాటు చేసిన శిబిరాలను.. చర్చల్లో కుదిరిన ఒప్పందం మేరకు చైనా ధ్వంసం చేసింది. ధ్వంసం చేసిన మరుసటి రోజు పెట్రోల్ పాయింట్ వద్ద భారత భద్రతా బృందానికి నాయకత్వం వహిస్తున్న కర్నల్ సంతోష్ బాబు చైనా సైనిక సిబ్బందితో మాట్లాడారు. అయితే జూన్ 14న చైనా ఆ శిబిరాన్ని రాత్రికి రాత్రే మళ్లీ తిరిగి ఏర్పాటు చేసింది చైనా. దీన్ని గమనించిన కర్నల్ సంతోష్ బాబు జూన్ 15న సాయంత్రం 5 గంటలకు వాటిని పరిశీలించేందుకు వెళ్లాలని నిర్ణయించారు.
రాత్రి 7 గంటలకు...
సాధారణంగా ఇలాంటి పరిశీలనలకు మేజర్ ర్యాంకు కల్గిన కంపెనీ కమాండర్ స్థాయి అధికారులు వెళతారు. అయితే గతంలో అక్కడే కంపెనీ కమాండర్‌గా పని చేసి ఉండడం, అప్పటికే పలుమార్లు చైనా సైన్యంతో మాట్లాడి ఉండడం సహా యువ సైనికులకే ఈ విషయాన్ని వదిలివేయరాదని నిర్ణయించి.. తానే స్వయంగా వెళ్లాలని భావించారు కర్నల్ సంతోష్ బాబు. చైనా ఏర్పాటు చేసిన శిబిరాలను పరిశీలించేందుకు రాత్రి 7 గంటలకు 35 మంది బృందంతో బయలుదేరారు కర్నల్ సంతోష్ బాబు.
కర్నల్ సంతోష్ బాబు బృందానికి చైనీయులతో ఘర్షణకు దిగాలన్న ఉద్దేశం లేదు. కేవలం శిబిరాలపై ఆరా తీయాలనుకున్నారు. చైనా ఏర్పాటు చేసిన శిబిరాల వద్దకు చేరుకున్న భారత బృందానికి.. అక్కడ చైనా సైనికుల్లో ఇంతకు ముందు చూసిన వారు, తెలిసిన వారు ఎవరూ లేకపోవడం వల్ల ఆశ్చర్యం కల్గించింది. టిబెట్‌లో విధులు నిర్వహించి గల్వాన్ లోయకు కొత్తగా వచ్చిన చైనా సైనికులే ఆ దేశం ఏర్పాటు చేసిన శిబిరం వద్ద కనిపించారు. కర్నల్ సంతోష్ బాబు బృందం చేరుకోగానే చైనా సైన్యం ఘర్షణకు దిగింది. తమ సైన్యం ఏర్పాటు చేసిన శిబిరాలను పరిశిలించే క్రమంలో మరింత ముందుకు వెళ్లకుండా అడ్డుకుంది. సంతోష్ బాబు మాట్లాడడం ప్రారంభించగానే.. ఓ చైనా సైనికుడు చైనా భాషలో తిడుతూ కర్నల్ సంతోష్ బాబును నెట్టివేశాడు.
అవమానం జరిగిందని...
సైన్యంలో ఓ కమాండింగ్ అధికారికి అవమానం జరిగితే సొంత తల్లితండ్రులకు అవమానం జరిగినట్లు కింది స్థాయి సిబ్బంది భావిస్తారు. ఈ నేపథ్యంలో సంతోష్ బాబును చైనా సైనికుడు నెట్టివేయగానే.. ఆయన వెంట యువ సైనికుల బృందం చైనా సైనికులపై విరుచుకుపడింది. వారితో ఘర్షణకు దిగి చైనా సైన్యం ఏర్పాటు చేసిన శిబిరాలను కాల్చి బూడిద చేసింది.
అర గంటపాటు సాగిన ఈ ఘర్షణ తర్వాత సంతోష్ బాబు బృందం వెనక్కి వచ్చింది. చైనా మరిన్ని అదనపు బలగాలను రప్పించి ఉండవచ్చని సంతోష్ బాబు అంచనా వేశారు. జరిగిన ఘటన పట్ల ఆయన వెంట ఉన్న యువ సైనికులు ఆ సమయంలో ఆగ్రహంతో రగిలిపోతూ చైనాకు తగిన గుణపాఠం చెప్పాల్సిందే అన్న కసితో ఉన్నారు.
రాత్రి 9 గంటలకు...
మొదటి ఘర్షణ జరిగిన కొద్ది సేపటికే గల్వాన్ లోయలోని పెట్రోలింగ్ పాయింట్ 14 వద్ద మరో ఘర్షణ జరిగింది. సంతోష్ బాబు బృందం రాత్రి 9 గంటలకు రెండోసారి తనిఖీకి వెళ్లగా.... ఈ సారి చైనా సైన్యం దాష్టీకానికి తెగబడింది. పెద్ద బండరాళ్లను భారత సైన్యంపైకి విసరడం ఆరంభించింది. వీటిలో ఓ రాయి కర్నల్ సంతోష్ బాబుకు తగిలింది. వెంటనే ఆయన గల్వాన్ నదిలోకి పడిపోయారు. చైనా సైనికులు ఆయనను లక్ష్యంగా చేసుకోకున్నా ఘర్షణలో ఆయన కూడా గాయపడ్డారు.
ఒక్క చోట జరిగిన ఘర్షణ వాస్తవాధీన రేఖ వెంట అనేక ప్రాంతాలకు విస్తరించింది. అన్ని చోట్ల కలిసి ఇరుపక్షాలకు చెందిన 300 మంది సైనికులు పరస్పరం ఘర్షణ పడ్డారు. చైనా సైనికులు రాళ్లు, ముళ్ల కంచె చుట్టిన ఇనుప కడ్డీలతో భారత సైనికులపై దాడి చేసింది. ఈ ఘర్షణ 45 నిమిషాల పాటు సాగింది. ఆ తర్వాత గంట పాటు పరిస్థితి ప్రశాంతంగా మారింది. ఇరు దేశాలు చనిపోయిన, గాయపడ్డ తమ సైనికులను మార్పిడి చేసుకున్నాయి. కర్నల్ సంతోష్ బాబు ఈ దాడిలోనే అమరులయ్యారు. ఆయన సహా పలువురు భారత జవాన్ల మృతదేహాలను చైనా సైన్యం అప్పగించింది. మిగతా మృతదేహాలు చైనా భూభాగం వైపే ఉండిపోయాయి.
చనిపోయిన తోటి సిబ్బంది మృతదేహాలు తీసుకోవడం సహా.. గాయపడిన వారిని వెనక్కి రప్పిస్తున్న సమయంలో భారత సైనికులు గాల్లో చైనా డ్రోన్ శబ్దాన్ని విన్నారు. అత్యాధునిక కెమెరాలు అమర్చిన ఈ డ్రోన్‌ను.. జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు చైనా పంపింది. అప్పటికే ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న భారత సైన్యం.. 16 బిహార్ రెజిమెంట్, 3 పంజాబ్ రెజిమెంట్‌కు చెందిన ఘాతక్ ప్లాటూన్లు సహా అదనపు బలగాలు కావాలని ఉన్నతాధికారులను కోరింది.
రాత్రి 11 గంటలకు...
ఈ ఘాతక్ ప్లాటూన్లను మెరుపు దళాలుగా వ్యవహరిస్తారు. జూన్ 15 రాత్రి 11 గంటల తర్వాత ఈ ఘాతక్ ప్లాటూన్ల నాయకత్వంలో భారత సైన్యం ఎల్ఏసీ నుంచి చైనా వైపు దూసుకుపోయింది. ఈ క్రమంలో మూడో సారి ఘర్షణ చెలరేగగా... రెండు వర్గాలు మరోసారి రాళ్ల దాడికి దిగాయి. ఈ దాడిలో గాయపడి అనేక మంది భారత్, చైనా సైనికులు ఇరుకైన గల్వాన్ నదిలో పడిపోయారు. 5 గంటల అనంతరం పరిస్థితులు మళ్లీ ప్రశాంతంగా మారిపోయాయి. ఆ తర్వాత ఇరు దేశాల సైనిక వైద్య బృందాలు తమ తమ సైనికులను తీసుకువెళ్లాయి. తమ తమ భూభాగంలో పడిపోయిన సైనికులను భారత్, చైనా మార్చుకున్నాయి. భారత్‌కు చైనా అప్పగించిన సైనికుల్లో ఇద్దరు మేజర్లు, ఇద్దరు కెప్టెన్లు, ఆరుగురు జవాన్లు ఉన్నారు.
పరిస్థితులు పూర్తిగా మారిపోయిన తర్వాత తమ భూభాగంలో పడిపోయిన చైనా సైనికులకు భారత వైద్య బృందాలు, ఆ దేశ భూభాగంలో పడిపోయిన భారత సైనికులకు అక్కడి వైద్య బృందాలు చికిత్స అందించాయి. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల పరిణామ క్రమం ఇది అని సైనికాధికారులు, నిపుణులు తెలిపారు. అటు ఈ ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులు కాగా, చైనా వైపు ఇది రెట్టింపు సంఖ్యలో ఉంటుందని సైనిక దళాల మాజీ ప్రధానాధికారి, కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ అన్నారు.