అలెప్పీ... కేరళ రాష్ట్రంలో ప్రకృతి అందాలకు చిరునామా. అలాంటి ప్రాంతాన్ని అకస్మాత్తుగా వచ్చిన వరదలు ఛిన్నాభిన్నం చేశాయి. పర్యాటకమే ప్రధాన వృత్తిగా జీవిస్తున్న అక్కడి ప్రజలంతా కట్టుబట్టలతో రోడ్డున పడాల్సిన పరిస్థితి. నిలువ నీడ లేకుండా బతుకు దుర్భరమై.. జీవిస్తున్న అలెప్పీ వాసులకు అండగా నిలవాలని రామోజీ గ్రూప్ తీసుకున్న నిర్ణయానికి మనసున్న మనుషులంతా కదిలి వచ్చారు. వారి దాతృత్వానికి తోడు రామోజీ గ్రూప్ కొంత మొత్తాన్ని కలిపి అలెప్పీ ప్రాంతంలో 121 ఇళ్ల నిర్మాణం చేపట్టింది. అందుకోసం కేరళలోనే అతిపెద్ద మహిళా గ్రూప్ కుటుంబ శ్రీ.. ఇళ్ల నిర్మాణంలో భాగస్వామ్యం కాగా కేవలం 8నెలల స్వల్ప వ్యవధిలోనే ఇళ్ల నిర్మాణం పూర్తయింది. నాటి అలెప్పీ సబ్ కలెక్టర్ ప్రస్తుత కేరళ పర్యాటక శాఖ ఏడీజీ కృష్ణ తేజ నేతృత్వంలో 121ఇళ్ల నిర్మాణం శర వేగంగా పూర్తయి నేడు లబ్ధిదారుల చేతికి అందనున్నాయి.
వేడుకలో ఈనాడు, మార్గదర్శి ఎండీలు..
పూర్తిగా ఇళ్ల నిర్మాణంలో మహిళలే భాగస్వామ్యులు కాగా... 420 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ నాలుగు గదుల ఇళ్ళు వరద బాధితుల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. అలెప్పీలోని క్యామ్లాట్ కన్వెన్షన్ సెంటర్లో నేడు జరిగే నూతన గృహాల ఆవిష్కరణ వేడుకలో కేరళ సీఎం పినరయి విజయన్ పాల్గొననున్నారు. వరదల్లో ఇళ్ళు కోల్పోయిన లబ్ధిదారులు సీఎం చేతుల మీదుగా నూతన గృహాల తాళాలను అందుకోనున్నారు.
ఇంతటి మహత్తరమైన సంకల్పాన్ని తీసుకుని.. నిర్విఘ్నంగా పూర్తి చేసిన రామోజీ గ్రూప్‌ను కేరళ ప్రభుత్వం సత్కరించనుంది. రామోజీ గ్రూప్ తరపున ఈనాడు ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ వేడుకలో పాల్గొని... రాష్ట్ర ప్రభుత్వ సత్కారాలను అందుకోనున్నారు.
కృష్ణ తేజకు సత్కారం...
ఈనాడు ఇళ్ల నిర్మాణ యజ్ఞంలో మొదటి నుంచి నాయకత్వం వహించిన యువ ఐఏఎస్ అధికారి కృష్ణ తేజను, నిర్మాణంలో పాలు పంచుకున్న కుటుంబ శ్రీ గ్రూప్ సభ్యులను సీఎం సత్కరించనున్నారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి.
ఈనాడు సహాయ నిధి ద్వారా తిరిగి సొంత ఇళ్లను పొందిన లబ్ధిదారులున్న ప్రాంతాలను ఈనాడు తెలంగాణ ఎడిషన్ ఎడిటర్ డీఎన్ ప్రసాద్, మార్గదర్శి వైస్ ప్రెసిడెంట్ రాజాజీలు శనివారం సందర్శించారు. రామోజీ సంస్థ కృషి పట్ల లబ్ధిదారులంతా సంతోషం వ్యక్తం చేశారు. కష్టకాలంలో తమను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన రామోజీ గ్రూప్ ఔదార్యాన్ని వేనోళ్ళా ప్రశంసిస్తున్నారు.
సంకల్పం మంచిదైతే సరిపోదు. అందుకు తగిన విధంగా కృషి చేయటం ఎంతో అవసరం. ఈ విషయంలో రామోజీ గ్రూపు ఏర్పాటు చేసిన ఈనాడు సహాయ నిధి పూర్తి స్థాయిలో విజయం సాధించిందనటానికి...ఈ ఇళ్లే నిదర్శనాలు.