శ్రీలంకలో తమిళ ప్రజల సమస్యలపై రెండు దేశాల మధ్య సానుకూల చర్చ జరిగిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తమిళ ప్రజలకు సమానత్వం, న్యాయం, శాంతిని అక్కడి ప్రభుత్వం కల్పిస్తుందని ఆశించారు.
రెండు దేశాల్లో వాణిజ్యం, పెట్టుబడుల్లో సంబంధాల బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. సంయుక్త ప్రాజెక్టులను నిర్వహిస్తామని ప్రకటించారు. భారత్ పర్యటనలో ఉన్న శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సేతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు మోదీ. అనంతరం సంయుక్త ప్రకటనలో చర్చకు సంబంధించిన వివరాలు తెలిపారు.
"ఉగ్రవాదం మన దేశాలకు అతిపెద్ద సమస్య. ఇప్పటివరకు రెండు దేశాలు ఎదుర్కొని నిలబడ్డాయి. ఇప్పుడూ ఉగ్రావాదానికి వ్యతిరేకంగా పరస్పర సహకారం పెంచుకోవాలని నిర్ణయించాం. శ్రీలంక అభివృద్ధిలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఉంటూ వచ్చింది.
ఇదేకాకుండా.. ఆ దేశంలో భారత మూలాలున్న తమిళులకు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించబోతున్నారు. తమిళుల ఆశలను అక్కడి ప్రభుత్వం నెరవేరుస్తుంది. రాజపక్సే, నేను జాలర్ల విషయానికి సంబంధించి మానవీయ కోణంలో వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నాం."
-నరేంద్రమోదీ, ప్రధాని
తర్వాత ప్రసంగించిన రాజపక్సే... రెండు దేశాల మైత్రి అత్యంత చారిత్రకమన్నారు.
భారత్లో 4 రోజుల పర్యటనలో భాగంగా శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే శుక్రవారం దిల్లీ చేరుకున్నారు. గతేడాది నవంబర్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి భారత్లో పర్యటించారు మహింద.
ఇదీ చూడండి: మోదీ-రాజపక్సే సరికొత్త స్నేహగీతం