కర్ణాటక సంకీర్ణ కూటమి రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అసమ్మతి ఎమ్మెల్యేలను కలిసేందుకు ముంబయి వెళ్లారు కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, మంత్రి డీకే శివకుమార్. అయితే... ఆయన్ను హోటల్లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. తమకు ప్రాణహాని ఉందని ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.
రాజీనామా చేసినవారిలో పది మంది ఎమ్మెల్యేలు ముంబయి హోటల్లో ఉన్నారు.
బుకింగ్ రద్దు...
ఎమ్మెల్యేలు ఉన్న హోటల్లోనే శివకుమార్ గది బుక్ చేసుకున్నారు. కానీ పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న కాసేపటికే అత్యవసర కారణాలతో బుకింగ్‌ను రద్దు చేస్తున్నట్లు హోటల్ యాజమాన్యం ప్రకటించింది. రూమ్ బుకింగ్ రద్దుపై శివకుమార్ స్పందించారు. తన మిత్రులను(రెబల్ ఎమ్మెల్యేలను) కలవకుండా ముంబయి వీడి వెళ్లనని హోటల్ వద్ద బైఠాయించారు.
అంతకుముందు హోటల్ వద్దకు శివకుమార్ రాక సందర్భంగా హైడ్రామా నెలకొంది. శివకుమార్ గో బ్యాక్ అంటూ ఒక బృందం నినాదాలు చేసింది.
తనకు వ్యతిరేకంగా చేసే నినాదాలతో భయపడనని వ్యాఖ్యానించారు డీకే.
"రాజ్‌నాథ్ సింగ్... కర్ణాటక వ్యవహారంతో భాజపా నేతలకు ఎలాంటి సంబంధం లేదని చెప్తారు. కానీ ఓ భాజపా నేత వచ్చి వారి వద్ద నుంచి ఫిర్యాదు లేఖను తీసుకుని పోలీసులకు అందించారు. వారు నన్ను కలిసేందుకు ఇష్టపడటం లేదని చెప్తారు. నాకు వారు బాగా తెలుసు. వారితో భాజపా సంబంధాలు కేవలం రెండు రోజులే. కానీ వారితో నాకు 40 ఏళ్లుగా పరిచయం ఉంది. నేనొక గదిని ఈ హోటల్లో బుక్ చేశాను. నా బుకింగ్‌ను వారు రద్దు చేశారు. గదులు అందుబాటులో ఉన్నాయి. నేను స్నానం చేయాలనుకుంటున్నాను. వారొక గదిని చూపలేకపోతే ముంబయి రోడ్లు ఉన్నాయి."
-డీకే శివకుమార్, కాంగ్రెస్ నేత
ఇదీ చూడండి: విషనాగులతో దోస్తీ! ఆ ఊరందరికీ మస్తీ!