దేశంలో సాధారణ ఎన్నికల వేళ అక్రమ నగదు తరలింపు వదంతులు పోలీసులకు తలనొప్పిగా మారుతున్నాయి. ఇలాంటి ఘటనే తమిళనాడు కోయంబత్తూర్‌లో జరిగింది. అక్రమ నగదు తరలింపుపై వదంతులు వ్యాప్తి చెందటం వల్ల ఓ కంటెయినర్‌ను అడ్డగించారు స్థానికులు. కానీ అందులో ఉన్నది టీ పొడేనని చివరకు తేలింది.
జరిగిందేమిటి?
అక్రమంగా నగదు తరలిస్తున్నారన్న వదంతులతో కోయంబత్తూర్‌లో ఓ కంటెయినర్ లారీని స్థానికులు అడ్డుకున్నారు. కంటెయినర్‌ను తెరిచేందుకు ప్రయత్నించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ట్రక్‌ను జిల్లా పాలనాధికారి కార్యాలయానికి తరలించి ఎన్నికల సంఘం అధికారులకు సమాచారం అందించారు.
ఎన్నికల అధికారులు అక్కడికి చేరుకుని కంటెయినర్‌ను తనిఖీ చేశారు. అందులో ఎలాంటి నగదు లభించలేదని, సుమారు రూ.30 లక్షల విలువైన టీ పొడి ఉన్నట్లు స్పష్టంచేశారు. జిల్లా పాలనాధికారి కార్యాలయానికి చేరుకున్న టీ పొడి యజమానులు సంబంధిత పత్రాలను సమర్పించారు. టీ పొడిని కొచ్చి పోర్టుకు తరలించి... అక్కడి నుంచి స్పెయిన్‌కు ఎగుమతి చేస్తున్నట్టు తెలిపారు.
వదంతులు వ్యాప్తి చేశారన్న ఆరోపణలతో నటుడు కమల్ హాసన్ మక్కళ్ నీది మయ్యం పార్టీకి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
2016 తమిళనాడు శాసనసభ ఎన్నికల సమయంలో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. రూ. 570కోట్ల నగదును అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో మూడు ట్రక్కులను అధికారులు జప్తు చేశారు. చివరకు ఆ నగదు ఎస్బీఐ బ్యాంకుదని తేలింది.