దేశ వ్యాప్తంగా పౌరచట్టం, జాతీయ పౌర జాబితాపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తోన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ వారిపై మండిపడ్డారు. 'అబద్ధాల పొదతో నిజమనే కొండ'ను దాచటానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.
"భారత్లో ముస్లిం సోదరులను ఎవరూ బలవంతంగా ఉంచటం లేదు. దేశం మీద ఇష్టం, ప్రేమతోనే వారు ఇక్కడ జీవిస్తున్నారు. కొంత మంది రాజకీయ ప్రయోజనాల కోసం సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లపై దుష్ప్రచారం చేస్తున్నారు. అబద్ధాల పొదతో నిజమనే పర్వతాన్ని దాచటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటి ద్వారా దేశంలోని ముస్లింలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎటువంటి వివక్షలకు తావు లేకుండా అభివృద్ధి వైపు దృష్టి సారిస్తోంది."
-ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి.
మైనారిటీలకు పాకిస్థాన్ నరక కూపమైతే భారత్ స్వర్గధామమని నఖ్వీ అన్నారు. ఈ విషయాన్ని గుర్తించలేని కొన్ని శక్తులు దేశాన్ని బలహీన పరచటానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శలు గుప్పించారు.
ఉత్తర్ప్రదేశ్లో ఆందోళనలను చేస్తోన్న వారిని 'అలా అయితే పాకిస్థాన్ వెళ్లిపోండి' అని పోలీస్ అధికారి అన్న వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి. నిజంగా పోలీసు వారిని పాకిస్థాన్ వెళ్లమని అంటే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అన్నారు.