ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ఘన విజయం సాధించింది. కూటమికి నేతృత్వం వహిస్తున్న జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ నేడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించనున్నారు.
ముర్హాబాదిలో ఘనంగా ఏర్పాట్లు..
ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ముర్హాబాది మైదానంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు పార్టీ శ్రేణులు. నేడు మధ్యాహ్నం 2 గంటకు ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సోనియా, రాహుల్ హాజరు!
హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హాజరవుతారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వారితో పాటు కాంగ్రెస్ ముఖ్యనేతలు హాజరవుతారని తెలిపాయి. ఇప్పటికే పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఝార్ఖండ్ చేరుకున్నారు.
కూటమి ఘన విజయం..
81 స్థానాలు ఉన్న ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 47 (జేఎంఎం-30, కాంగ్రెస్-16, ఆర్జేడీ-1) స్థానాల్లో గెలుపొంది సాధారణ మెజార్టీ కన్నా 5 సీట్లు ఎక్కువ సాధించింది. ఈ ఎన్నికల్లో అధికార భాజపా పార్టీ 25 స్థానాలతో సరిపెట్టుకుని అధికారాన్ని కోల్పోయింది.
38 ఏళ్లకే సీఎంగా తొలిసారి బాధ్యతలు..
పోటీ చేసిన తొలి ఎన్నికల్లో ఓటమి చెందినా.. సోదరుడి మృతితో పార్టీ పగ్గాలు చేపట్టారు సోరెన్. 2009-10 వరకు రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. అర్జున్ ముండా ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం అయ్యారు. ఆ తర్వాత 2013 జులైలో 38 ఏళ్లకే సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2014 డిసెంబర్ వరకు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నది కేవలం 17 నెలలే అయినా పాలనలో తనదైన ముద్ర వేశారు సోరెన్.
కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న భాజపాను ఓడించేందుకు కాంగ్రెస్, ఆర్జేడీతో జట్టుకట్టి విజయం సాధించారు హేమంత్. రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు.
ఇదీ చూడండి: 'నిజమనే పర్వతాన్ని అబద్ధమనే పొదతో కప్పుతున్నారు'