ఝార్ఖండ్‌లో విపక్షాలు ఏకమై తమ ఐకమత్యాన్ని చాటిచెప్పాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం చేసిన తరుణంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా భాజపాయేతర నేతలు తరలివెళ్లి తమ మద్దతును ప్రకటించారు. పౌరసత్వ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో విపక్షాల ఐకమత్యానికి ప్రాధాన్యం ఏర్పడింది.
11వ ముఖ్యమంత్రిగా...
రాంచీలోని మోరాబది మైదానంలో ఝార్ఖండ్ 11వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర గవర్నర్ ద్రౌపది ముర్ము ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. ఈ వేడుకలో సోరెన్‌తో పాటు ముగ్గురు మంత్రులు కూడా ప్రమాణం చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డీఎంకే అధినేత స్టాలిన్, సీపీఎం, సీపీఐ నేతలు సీతారాం ఏచూరీ, డి. రాజా, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సహా పలువురు అగ్రనేతలు హాజరయ్యారు.
ఝార్ఖండ్‌లో నెలకొన్న సంకీర్ణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, ప్రజాభివృద్ధి, శాంతికి నిరంతర కృషి చేస్తుందని రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రధాని శుభాకాంక్షలు
ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన హేమంత్ సోరెన్‌కు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ.
"ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన హేమంత్ సోరెన్‌కు శుభాకాంక్షలు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి సహాయసాకారాలు అందిస్తామని భరోసా ఇస్తున్నాను."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఘన విజయంతో..
81 స్థానాలు ఉన్న ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 47 (జేఎంఎం-30, కాంగ్రెస్-16, ఆర్జేడీ-1) స్థానాల్లో గెలుపొంది సాధారణ మెజార్టీ కన్నా 5 సీట్లు ఎక్కువ సాధించింది. ఈ నేపథ్యంలో ఝార్ఖండ్ వికాస్ మోర్చాకు చెందిన ముగ్గురు శాసనసభ్యులు, ఒక సీపీఎం సభ్యుడు జేఎంఎం కూటమికి మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో అధికార భాజపా పార్టీ 25 స్థానాలతో సరిపెట్టుకుని అధికారాన్ని కోల్పోయింది.
ఇదీ చూడండి : 'సోరెన్ అను నేను'-ఝార్ఖండ్ 11వ సీఎంగా ప్రమాణం