మహారాష్ట్రలోని ముంబయి, పాల్ఘర్, ఠాణె సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు పొంగిపొర్లుతున్నాయి. పంచగంగా నదిపై ఉన్న రాజారామ్ డ్యామ్ నీటి మట్టం ప్రమాద స్థాయిని దాటేసింది. దీంతో నదీ తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని కొల్హాపుర్ జిల్లా అధికారులు హెచ్చరించారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రహదారులు, రైల్వే ట్రాక్ల మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. పలు రైళ్ళు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ప్రచండ గాలులకు చెట్లు నేలకొరిగాయి. పలు వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు అధికారులు.
ఎటువంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి జాతీయ విపత్తు స్పందన దళాలను(ఎన్‌డీఆర్‌ఎఫ్) ఠాణె, పాల్ఘర్ జిల్లాల్లో మోహరించినట్లు అధికారులు చెప్పారు.
ఇదీచూడండి: రామాలయానికి వెంకయ్య కుటుంబం విరాళం