వరుణుడి ప్రకోపానికి దేశంలోని పలు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా అనేక ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.
భారీ వర్షాలతో కర్ణాటక కలకలం
కర్ణాటకలో వరద తీవ్ర ప్రభావం చూపుతోంది. కుండపోత వర్షాలకు తోడు మహారాష్ట్ర ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద నీటితో కన్నడనాట నదులు ఉప్పొంగుతున్నాయి. అనేక ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. చిక్‌మగళూరు, కొడగు, హుబ్లి-ధార్వాడ్, కార్వార్, హసన్, శివమొగ్గ జిల్లాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది.
బెళగావిలోని రహదారి దెబ్బతిని బెంగళూరు-పుణె మధ్య బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు చెందిన దాదాపు 20వేల మందిపై వరద ప్రభావం చూపింది. వరద ముప్పు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కర్ణాటకలో వరదల కారణంగా ఇప్పటికి ఐదుగురు చనిపోయారు.
మహారాష్ట్రలో తగ్గని వర్షాలు
వరుణుడి విధ్వంసానికి మహారాష్ట్ర వణికిపోతోంది. 7 రోజులుగా కురుస్తున్న వర్షాలకు 16మంది ప్రాణాలు కోల్పోయారు. వరద ప్రమాద స్థాయిని మించడం వల్ల జలాశయాలనుంచి నీటిని విడుదల చేశారు. మరో 2,3 రోజుల వరకు పుణె సహా, కోల్హాపూర్, సతారా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
పలు రాష్ట్రాల్లో..
ఉత్తర్‌ప్రదేశ్‌లో వర్షాలతో బుధవారం ఒకే రోజు 14 మంది పిడుగుపాటుకు మృత్యువాత పడ్డారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంతి యోగి ఆదిత్యనాథ్ 4లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.
హిమాచల్‌లోని పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. రాజస్థాన్‌లోని కోటా-బూందీ జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది.
ఒడిశాలోనూ వరుణుడు బీభత్సం సృష్టించాడు. అంబోలా వద్ద గూడ్సు రైలు పట్టాలు తప్పి రాయగడా-టిట్లాగర్ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాసిపూర్ పరిధిలోని వంతెన తెగిపోవడం వల్ల చుట్టుపక్కల గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రైల్వే లైన్ దెబ్బతిన్న కారణంగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.