కరోనా వైరస్ నుంచి ప్రజలను డెక్సామెథసోన్ ఔషధం కాపాడుతోందని బ్రిటన్ వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో కొవిడ్-19 బాధితుల చికిత్స, నిర్వహణ నిబంధనావళిని కేంద్ర వైద్యారోగ్య శాఖ సవరించింది. వ్యాధి, తీవ్ర లక్షణాలతో బాధపడేవారికి ప్రాణవాయువు అవసరం, అధిక ఇన్‌ఫ్లమేటరీ (మంట) స్పందన ఉన్నవారికి డెక్సామెథసోన్ స్టెరాయిడ్‌ను ఉపయోగించొచ్చని తెలిపింది. మిథైల్‌ప్రెడ్నినిసోలొన్‌కు ప్రత్యామ్నాయంగా వాడొచ్చని వివరించింది.
'కొవిడ్-19 బాధితుల సవరించిన చికిత్స, నిర్వహణ నిబంధనావళిని జారీచేశాం. మిథైల్‌ప్రెడ్నిసోలొన్‌కు ప్రత్యామ్నాయంగా డెక్సామెథసోన్‌కూ అనుమతి ఇస్తున్నాం' అని ఆరోగ్య శాఖ ట్వీట్ చేసింది. ఇప్పటి వరకు కరోనా వైరస్‌కు ధ్రువీకరించిన చికిత్సా విధానమేదీ లేదు. గతంలో కనుగొన్న యాంటీ వైరల్ డ్రగ్స్‌తోనే చికిత్స అందిస్తున్నారు.
అసలేంటీ డెక్సామెథసోన్?
డెక్సామెథసోన్ ఒక స్టెరాయిడ్. 1960 నుంచి వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ఇన్‌ఫ్లమేషన్ లక్షణాలను తగ్గించేందుకు, ఇన్‌ఫ్లమేషన్ కారక రోగాలు, కొన్ని రకాల క్యాన్సర్ల చికిత్సలో దీనిని వాడతారు. 1977 నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర ఔషధాల జాబితాలో దీనికి చోటుంది. వివిధ ఫార్ములేషన్లలో దీనిని ఉపయోగిస్తారు. మేధోపర హక్కులు లేవు కాబట్టి అనేక దేశాల్లో సరసమైన ధరల్లోనే అందుబాటులో ఉంది. కరోనా బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ఇదెంతో సాయపడుతోందని బ్రిటిష్ క్లినికల్ ట్రయల్స్‌లో గుర్తించడంతో డెక్సామెథసోన్ ఉత్పత్తిని వేగంగా పెంచాలని డబ్ల్యూహెచ్ఓ పిలుపునిచ్చింది.
ఇదీ చూడండి: భవిష్యత్ తరాల మార్గదర్శి- సంస్కరణల రుషి 'పీవీ'