కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం బెయిల్ పిటిషన్పై నేడు తీర్పును వెలువరించనుంది దిల్లీ హైకోర్టు. ఐఎన్ఎక్స్ మీడియా మనీ ల్యాండరింగ్ కేసులో ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న ఆయన బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఆయన బెయిల్ పిటిషన్పై నవంబర్ 8న విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ ఖైత్ తీర్పును రిజర్వులో ఉంచారు.
కేసులో ఆధారాలు పత్రాల రూపంలో ఉన్నాయని.. వాటిని తాను ప్రభావితం చేయలేనని పేర్కొంటూ బెయిల్ మంజూరు చేయాలని చిదంబరం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే చిదంబరం సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. బెయిల్ మంజూరును వ్యతిరేకిస్తూ వాదనలు వినిపించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.
కేసు విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈడీ తరఫున వాదనలు వినిపించగా.. చిదంబరం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు హాజరయ్యారు. ఈడీ కేసులో సాక్షులను ప్రభావితం చేసేందుకు చిదంబరం ఎప్పుడూ ప్రయత్నించలేదని పేర్కొన్నారు. అయితే అకస్మాత్తుగా అక్టోబర్లో ఆయన సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపణలు రావడం అవాంఛనీయమన్నారు.
చిదంబరానికి బెయిల్ మంజూరు చేయకూడదన్న ఈడీ వాదనను వ్యతిరేకించారు సిబల్. కేసులో పురోగతి దిశగా ఈడీ వ్యవహరించడం లేదని కేవలం చిదంబరాన్ని జైల్లో ఉంచి.. ఆయన ఆరోగ్యం పాడు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుందని ఆరోపించారు.
ఇదీ చూడండి: 13 మంది 'అనర్హత' ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు