ఉత్తర్‌ప్రదేశ్ హాథ్రస్ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. అత్యాచార బాధితురాలికి చికిత్స చేసిన జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కళాశాల, అలీగఢ్ ఆసుపత్రికి వెళ్లింది. వైద్యులను కలిసిన సిట్ బృందం పలు ప్రశ్నలు సంధించింది. గైనకాలజీ, ఆప్తమాలజీ, ఫోరెన్సిక్, న్యూరోసర్జరీ విభాగానికి చెందిన సిబ్బంది నుంచి వివరాలు సేకరించింది.
ఘటనపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో ఈ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించారు సీఎం యోగి ఆదిత్యనాథ్. ఫాస్ట్ ట్రాక్ కోర్టులోనూ కేసు విచారణ జరుపుతున్నారు. 7 రోజుల్లో సిట్ దర్పాప్తు నివేదికను సమర్పించాలని యోగి ఆదేశించారు.
నిరాకరణ...
హాథ్రస్ బాధితురాలి కుటుంబం ఆమె అస్థికలను నీటిలో కలపడానికి నిరాకరించింది. ఆమె మృతదేహన్ని రాత్రికి రాత్రి దహనం చేసిన విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది.
ఇదీ జరిగింది...
సెప్టెంబర్ 14న యూపీలో దళిత యువతిపై నలుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను గొంతుకోసి హతమార్చేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో బాధిత యువతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధితురాలిని సెప్టెంబర్ 14న యూపీ అలీగఢ్‌లోని జవహర్లాల్ నెహ్రూ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం దిల్లీలోని సఫ్దార్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సెప్టెంబర్ 29న ఆమె మృతి చెందింది.