హరియాణా కురుక్షేత్రలో కామాంధుల పైత్యం ఆలస్యంగా వెలుగు చూసింది. ఆరు నెలల క్రితం గ్రామంలో అభం శుభం తెలియని ఓ 14 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడడమే కాకుండా బలవంతంగా వ్యభిచార ఊబిలోకి దింపారు. రోజుకు నలుగురు కామాంధులను ఆమెపై ఉసిగొలిపి రాక్షసానందం పొందారు.
బిడ్డ జాడ కోసం తల్లిదండ్రులు పోలీసులను వేడుకున్నారు. కానీ, లాభం లేకపోయింది. ఆరు నెలల తర్వాత బాలిక ధైర్యం చేసి ఆ నరకం నుంచి తప్పించుకుని పోలీసులను చేరింది. విషయం రాష్ట్ర మహిళా కమిషన్‌కు తెలిసింది.
"మా గ్రామానికి చెందిన కొందరు యువకులు నా కూతురిని అపహరించారు. తర్వాత హోటల్‌కు తీసుకెళ్లారు. ఆపై ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఓ మహిళకు నా బిడ్డను అమ్ముకున్నారు. ఆమె నా కూతురితో వ్యభిచారం చేయించింది. నా బిడ్డ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది. దీంతో ఆమెకు ఓ యువకుడితో బలవంతంగా పెళ్లి చేశారు. కానీ, కొందరి సాయంతో నా కూతురు పోలీసులను ఆశ్రయించింది. "
- బాధితురాలి తల్లి
బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా... ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోనందుకు పోలీసులపై మండిపడింది హరియాణా రాష్ట్ర మహిళా కమిషన్.
"కురుక్షేత్రలో ఈ ఏడాది జనవరి 20న బాలికను అపహరించారు. తల్లిదండ్రులు కూతురు తప్పిపోయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ, లాభం లేకపోయింది. ఈలోగా బాధితురాలు అక్రమ రవాణాదారుల వలలో చిక్కింది. బాలికను ఎత్తుకెళ్లినవారు డబ్బులు తీసుకుని ఆమెను అమ్మేశారు. ఆపై బాలికను వ్యభిచారంలోకి దింపారు. దాదాపు వంద సార్లు అత్యాచారానికి గురైనట్లు బాధితురాలు తెలిపింది. రోజుకు కనీసం ముగ్గురు నలుగురు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేవారని చెప్పింది. ఆ తర్వాత కాజల్ అనే మహిళ బాలికను ఉత్తర్‌ప్రదేశ్ లూధియానాకు కూడా తీసుకెళ్లింది. "
-నమ్రతా గౌర్, హరియాణా రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు
ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రతి అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది హరియాణా రాష్ట్ర మహిళా కమిషన్.
ఇదీ చదవండి: ఆటోలో కాన్పు- గర్భంలోనే శిశువు మృతి