కాంగ్రెస్ 70 ఏళ్ల క్రితం చేసిన చారిత్రక తప్పిదాన్ని భాజపా సరిచేసిందని.. ఆర్టికల్ 370 రద్దును ప్రస్తావిస్తూ హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నాల్‌లో పర్యటిస్తున్న ఆయన ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు.
హరియాణాలో భాజపా ప్రభుత్వంపై విపక్షాల విమర్శలపై ఖట్టర్ స్పందించారు. దుష్ప్రచారం చేయటమే విపక్షాల పనని ఆరోపించారు.
"దుష్ప్రచారాలను వ్యాప్తి చేయటమే విపక్షాల పని. అలా చేసేవాళ్లనే మనం విపక్షాలని పిలుస్తాం. కానీ ఈ ప్రచారాలతో మాకు వచ్చిన నష్టమేమీ లేదు. హరియాణా ప్రజలే మాకు ముఖ్యం. వాళ్లు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. భారీ మెజారిటీతో భాజపా తిరిగి అధికారంలోకి రావటం ఖాయం."
-మనోహర్‌లాల్ ఖట్టర్, హరియాణా ముఖ్యమంత్రి
ఎన్నికల హామీలను నెరవేర్చటంలో భాజపా ప్రభుత్వం విఫలమయిందన్న విపక్షాల ఆరోపణలను ఖట్టర్ ఖండించారు.
"మా మేనిఫెస్టోలో లేని చాలా పనులను మేం చేశాం. హరియాణాను కిరోసిన్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాం. 'బేటీ బచావో-బేటీ పడావో'కు భారీ ప్రచారం కల్పిస్తున్నాం. మేనిఫెస్టోలో చెప్పిన హామీలలో 96 శాతం నెరవేర్చాం."
-మనోహర్‌లాల్ ఖట్టర్, హరియాణా ముఖ్యమంత్రి
70 ఏళ్ల తప్పిదాన్ని సరిదిద్దాం
శాసనసభ ఎన్నికల్లోనూ జమ్ము కశ్మీర్ అంశాన్ని భాజపా లేవనెత్తుతోందన్న కాంగ్రెస్ విమర్శలపై ప్రతిదాడి చేశారు ఖట్టర్.
"అవును.. మేం తప్పకుండా ఈ అంశాలను లేవనెత్తుతాం. దీని వెనుక ఎన్నో ఆలోచనలు, భావోద్వేగాలు ఉన్నాయి. ఎన్నికల్లో అధికరణ 370 రద్దు అంశం అసంబద్ధమా? కాంగ్రెస్ 70 ఏళ్ల క్రితం చేసిన పెద్ద తప్పును మేం సరిదిద్దాం. కశ్మీర్‌తో పాటు హరియాణా సమస్యలను కూడా మేం ప్రస్తావిస్తాం. రైతులు, మహిళలు, యువత.. ఇలా ప్రతి సమస్యపై చర్చించాం. మేం దేన్నీ వదిలేయలేదు."
-మనోహర్‌లాల్ ఖట్టర్, హరియాణా ముఖ్యమంత్రి
'తప్పుడు వ్యాఖ్యలు కావు'
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు ఖట్టర్.
"నేను ఎప్పుడూ తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు. జాతీయాలు, సామెతలను మాత్రమే ఉపయోగించాను. అందులో వారి సమస్య ఏంటో నాకు తెలియదు. వాళ్లకు జాతీయాలు తెలియకపోయినంత మాత్రాన నేను వెళ్లి నేర్పించలేను కదా!"
-మనోహర్‌లాల్ ఖట్టర్, హరియాణా ముఖ్యమంత్రి
కర్నాల్‌లోనే ప్రచారం ముగింపు
తన సొంత నియోజకవర్గమైన కర్నాల్‌లోనే ప్రచారానికి ముగింపు పలుకుతామని ఖట్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలపై ప్రశంసలు కురిపించారు. వారి అంకితభావం కారణంగానే రాష్ట్రంలో పార్టీ నిలబడగలిగిందని పేర్కొన్నారు. అక్టోబర్ 21న భారీ ఎత్తున ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని అభ్యర్థించారు.
"ఓటు హక్కు వినియోగించుకోవటం మన అందరి హక్కు. ఎవరికి ఓటు వేయాలనే నిర్ణయం కూడా మనదే."
-మనోహర్‌లాల్ ఖట్టర్, హరియాణా ముఖ్యమంత్రి
- ఇదీ చూడండి: ఈ పెళ్లితో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని!