హరియాణా ఖైతాల్‌లోని డోగ్రా గేట్లో అభం శుభం తెలియని ఓ పసికందును నిర్దాక్షిణ్యంగా మురుగు కాల్వలో పడేసిన వైనం తాజాగా వెలుగుచూసింది. కాల్వలో పడేసిన చిన్నారిని వీధి కుక్కలు బయటకు తీసి తీవ్రంగా గాయపరిచాయి. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది ఈ విషయాన్ని గమనించి ఆ పసికందును ఆస్పత్రికి తరలించారు.
చిన్నారిని ఓ మహిళ ప్లాస్టిక్ సంచిలో చుట్టి కాల్వలో పడేసినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
"డోగ్రా గేట్లో నవజాత శిశువు దొరికింది. పసికందును విధుల్లో ఉన్న సిబ్బంది చూశారు. సుమారు 7-8 రోజుల వయస్సు ఉంటుంది. ముందుగా చనిపోయినట్లు భావించినప్పటికీ అక్కడకు వెళ్లి చూశాక చిన్నారి ప్రాణాలతో ఉందని తెలిసింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించాం. పాపను చంపేసే ఉద్దేశంతోనే నాలాలో పడివేసినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం."
- ప్రదీప్ కుమార్, పోలీసు అధికారి.
ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పాప పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. పాపను రక్షించేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: మేడ్చల్లో గుర్తుతెలియని బాలిక మృతదేహం లభ్యం