1977 ఎమర్జెన్సీ తర్వాత దేశంలో తొలిసారి ఓ ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకోవడానికి ప్రజలు పోరాడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ... తన కోసం మాతృమూర్తులు, చెల్లెళ్లు, యువత కలిసికట్టుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
విపక్షాలపై మోదీ మండిపడ్డారు.
ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను విపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు.
"ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీలో ఓ ఆసుపత్రి ఉంది. ఈ అసుపత్రి ట్రస్ట్‌కు చెందిన సభ్యుడు రాహుల్ కుటుంబానికి సన్నిహితుడు. కొన్ని రోజుల క్రితం ఓ పేదవాడు ఆయుష్మాన్ భారత్ కార్డు పట్టుకుని చికిత్స పొందడానికి ఆ ఆసుపత్రికి వెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మీరు నివ్వెరపోతారు. మోదీ ఇచ్చిన ఆయుష్మాన్ భారత్ కార్డు ఉందనే ఆ పేదవాడికి వైద్యం చేయడానికి నిరాకరించారు. మీడియా కథనం ప్రకారం... ఆయుష్మాన్ కార్డు చెల్లడానికి ఇది మోదీ ఆసుపత్రి కాదని వారు అన్నారు."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.