రామ జన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు ఆదేశించిన విధంగా మందిర నిర్మాణానికి కేంద్రం.. ట్రస్ట్ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారుల బృందం... సుప్రీం కోర్టు తీర్పును క్షుణ్ణంగా పరిశీలిస్తునట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.
రామమందిర నిర్మాణానికి సంబంధించి ట్రస్టు ఏర్పాటుకై న్యాయ మంత్రిత్వ శాఖ, అటార్నీ జనరల్ అభిప్రాయాలను తీసుకోనున్నారు. కొత్తగా ఏర్పడే ట్రస్టుకు నోడల్ వ్యవస్థగా కేంద్ర హోంశాఖ ఉంటుందా..? లేక సాంస్కృతిక శాఖకు అప్పగించనున్నారా అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
తీర్పు ప్రకారం కార్యాచరణ...
అయోధ్య స్థలం వివాదంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి, జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద భూమి హిందువులదే అని ఈ నెల 9న ఏకగ్రీవ తీర్పు వెలువరించింది.
2.77 ఎకరాల వివాదాస్పద భూమి.. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుందని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం 3 నెలల్లో కార్యాచరణను ప్రకటించి రామమందిర నిర్మాణం కోసం ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. కేంద్రం, యూపీ సర్కార్ భవిష్యత్ కార్యాచరణను పర్యవేక్షించాలని పేర్కొంది.