కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న హింసపై స్పందించాలంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలోని ప్రతిపక్షనేతలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ చట్ట సవరణ రాజ్యాంగ విరుద్ధమని, విభజనపూరితమని ఆరోపిస్తూ.. దాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్రపతిని అభ్యర్థించారు. అనంతరం దేశంలో నెలకొన్న పరిస్థితులపై ప్రతిపక్ష నేతలు రాష్ట్రపతితో చర్చించారు.
కాంగ్రెస్ సహా సీపీఐ-ఎం, సీపీఐ, డీఎంకే, ఎస్పీ, టీఎంసీ, ఆర్జేడీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఐయూఎంఎల్, ఏఐయూడీఎఫ్ పార్టీలకు చెందిన సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
'ప్రజల గొంతు నొక్కుతున్నారు'
భాజపా ప్రభుత్వంపై సోనియా గాంధీ విరుచుకుపడ్డారు. ప్రజామోదం లేని చట్టాలు తీసుకువచ్చి, వారి నోరు నొక్కుతున్నారని ఆరోపించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నట్లు పేర్కొన్నారు సోనియా.
"ఈశాన్య భారతదేశంలో ఉన్న పరిస్థితులు రాజధాని సహా దేశమంతటా వ్యాపిస్తున్నాయి. ఈ పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి. ఇవి మరింత విజృంభిస్తాయనే ఆందోళన నెలకొంది. శాంతియుతంగా జరిగిన నిరసనల(జామియా ఘటన) పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు బాధాకరం."-సోనియా గాంధీ
మహిళల హాస్టళ్లలోకి పోలీసులు రావడాన్ని సోనియా తీవ్రంగా తప్పుబట్టారు. విచక్షణా రహితంగా వారిపై దాడి చేయడాన్ని ఖండించారు.
పౌరసత్వ చట్ట సవరణ నిరసనల నేపథ్యంలో ఆదివారం రాత్రి జామియా విశ్వవిద్యాలయ విద్యార్థులు- పోలీసుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనేక మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటనను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి.