అధికార, విపక్షాలు పరస్పరం మాట్లాడుకోవాలన్నారు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు. అధికారిక, అనధికారికంగా ఇరు పక్షాల మధ్య మాటలు కొనసాగితే పలు అంశాలపై ఏకాభిప్రాయ సాధనకు, పెండింగ్ బిల్లుల ఆమోదానికి అవకాశం ఉంటుందని ఆకాంక్షించారు. గత కొన్ని సెషన్లలో సభలో కార్యకలాపాలకు అంతరాయం, వాయిదాల పర్వం కొనసాగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో వెంకయ్య వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
నీటి కరవు, పర్యావరణంపై సభ్యుల భాగస్వామ్యాన్ని మెచ్చుకున్నారు వెంకయ్య. గత వారం రోజులుగా సభ తీరును ప్రజలు మెచ్చుకున్నారని తెలిపారు. రాజ్యసభకు ప్రశంసలు రావడమే తన లక్ష్యమని ఉద్ఘాటించారు.
సభ్యులు జీరో అవర్లో లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు మంత్రులు సమాధానమిచ్చేలా చూడాలని రాజ్యసభ నేత థావర్ చంద్ గహ్లోత్, పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి వి. మురళీధరన్లకు సూచించారు.
రాజ్యసభలో పెండింగ్లో ఉన్న 22 బిల్లులు 16వ లోక్సభ రద్దయిన కారణంగా వీగిపోయాయి. మరో 33 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వాటిలో మూడు 20 ఏళ్లకు పైబడినవి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పై విధమైన వ్యాఖ్యలు చేశారు రాజ్యసభ ఛైర్మన్.