ప్రపంచవ్యాప్తంగా 21వేలకుపైగా ప్రాణాలు తీసి, భారత్‌లో 600 మందికి సోకిన కరోనా మహమ్మారిపై పోరాటానికి ప్రభుత్వం వలంటీర్ వైద్యుల కోసం వెతుకుతోంది. సమీప భవిష్యత్తులో ప్రభుత్వ, శిక్షణా ఆసుపత్రుల్లో తమ సేవలను అందించడానికి తగిన విధంగా, సిద్ధంగా ఉన్న వలంటీర్లు ముందుకు రావాలని నీతిఆయోగ్ వెబ్సైట్లో ప్రకటన చేసింది.
"ప్రాణాంతక కరోనా వైరస్‌తో పోరాడటానికి... పదవీ విరమణ చేసిన ప్రభుత్వ, సాయుధ దళాల వైద్యులు, ప్రైవేటు డాక్టర్లు ముందుకు వచ్చి ప్రభుత్వం చేస్తున్న కృషిలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి."
- నీతి ఆయోగ్ వెబ్సైట్లో చేసిన ప్రకటన
ఈ విపత్తు సమయంలో దేశానికి తమ వంతు సేవలు అందించాలనుకునేవారు ... నీతి ఆయోగ్ అధికారిక వెబ్సైట్లో అందించిన లింక్ ద్వారా నమోదు చేసుకోవాలి.
పెనుభారం
కరోనా దేశవ్యాప్తంగా చాపకింద నీరులా పాకుతూనే ఉంది. దీనితో దేశం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటోంది. పెద్ద సంఖ్యలో వస్తున్న రోగులను చూసుకోవడానికి ఉన్న వైద్యులు సరిపోవడం లేదు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలను మరింత వేగవంతంగా పెంచాలని భావిస్తున్నాయి. దీనితో వైద్యులపై తీవ్రమైన భారం పడుతోంది.
అమెరికా, ఇటలీ, యూకే, వియత్నాం సహా అనేక దేశాల ప్రభుత్వాలు.... కరోనాపై పోరాటానికి రిటైర్డ్ హెల్త్ వర్కర్లు తిరిగి పనిలో చేరాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.
ఐసోలేషన్ పడకల ఏర్పాటు
పరిస్థితులు చేయి దాటి పోకుండా, కేంద్ర ప్రభుత్వం ఆర్మీ ఆర్డినెన్స్ కర్మాగారాలు, కేంద్ర పారామిలిటరీ దళాల ఆసుపత్రుల్లో... కొవిడ్-19 బాధితుల చికిత్స కోసం 2,000 ఐసోలేషన్ పడకలు ఏర్పాటు చేశారు.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్ హమీర్ పుర్ జిల్లాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లోని 2,000 గదులున్న 10 హాస్టళ్లను ఐసోలేషన్ కేంద్రంగా తీర్చిదిద్దారు.
కోల్‌కతాలోని 2,200 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఇతర వ్యాధులతో బాధపడుతున్న రోగులను చేర్చుకోవడం లేదు. ఐసోలేషన్ గదుల్లో ఉండి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన కరోనా రోగులను డిశార్జి చేస్తున్నారు.
ఇదీ చూడండి: 5 కోట్ల మంది పేదలకు భాజపా ఉచిత భోజనం