17వ లోక్సభ తొలి పార్లమెంట్ సమావేశాలను పొడిగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. వివిధ బిల్లుల ఆమోదం పెండింగ్లో ఉన్న దృష్ట్యా ఆగస్టు రెండో తేది వరకు సమావేశాలను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. పొడిగింపు లేనట్లయితే జూన్ 17న ప్రారంభమైన సమావేశాలు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26తో ముగుస్తాయి.
సమావేశాల పొడిగించే అంశమై విపక్ష పార్టీలతో కేంద్ర మంత్రులు చర్చిస్తున్నారని సమాచారం. సమావేశాల పొడిగింపునకు సుముఖంగా లేమని కొంతమంది విపక్ష నేతలు వ్యాఖ్యానించారు.
ముమ్మారు తలాక్ సహా 13 బిల్లులకు సభ ఆమోదం లభించలేదు. ఈ నేపథ్యంలోనే సభను పొడిగించడానికి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ముమ్మారు తలాక్ బిల్లు ప్రస్తుత సమావేశాల చివరి వారంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే లోక్సభ షెడ్యూల్ సమయానికి మించి పనిచేస్తోంది. ఈ సమావేశాల్లో రెండు సార్లు అర్ధరాత్రి వరకూ కార్యకలాపాలు నిర్వహించింది.
"ఈ దఫా సమావేశాలు నిర్ణీత వేళలను మించి పనిచేస్తున్నాయి. 2019, జులై 16 వరకు 128 శాతం ఉపయోగకరంగా సమావేశాలు జరిగాయి. గత 20 ఏళ్లలో ఇదే అత్యధిక సమయం"
-పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్
జులై 16వరకు రాజ్యసభ 98 శాతం ఉత్పాదకతతో పనిచేసింది.
నిర్ణయించిన కాలవ్యవధితో వాస్తవంగా సభ జరిగిన సమయాన్ని పోల్చి సమావేశాల ఉత్పాదకతను లెక్కిస్తారు.
ఇదీ చూడండి: సోమవారానికి కర్నాటకీయం వాయిదా!