పార్లమెంటు శీతాకాల సమావేశాలపై సందిగ్ధత నెలకొన్న తరుణంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక వ్యాఖ్యలు చేశారు. సమావేశాలను నిర్వహించేందుకు లోక్సభ సచివాలయం సిద్ధంగా ఉందని... అయితే తేదీలపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు. దిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఓం బిర్లా.
"లోక్సభ సెక్రటేరియట్ సిద్ధంగా ఉంది. కానీ పార్లమెంట్ శీతాకాల సమావేశల తేదీలు వెలువడాల్సి ఉంది. పార్లమెంట్ వ్యవహారాలపై ఏర్పాటు చేసిన కేబినెట్ కమిటి దీనిని నిర్ణయిస్తుంది."
-- ఓం బిర్లా, లోక్సభ స్పీకర్.
అనంతరం.. ఈ నెల 25, 26వ తేదీల్లో గుజరాత్లోని కేవడియాలో 80వ అఖిల భారతీయ సంభాపతుల సదస్సును నిర్వహించినున్నట్టు వెల్లడించారు ఓం బిర్లా. ఈ సదస్సులో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని పేర్కొన్నారు.
సమావేశాలు జరిగేనా?
కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్లో జరిగాయి. ప్రత్యేక ఏర్పాట్లు చేసి, కరోనా నిబంధనలు పాటిస్తూ సభను నిర్వహించారు. అయినప్పటికీ పలువురు ఎంపీలకు కరోనా సోకింది.
సహజంగా నవంబర్-డిసెంబర్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతాయి. కానీ ప్రస్తుతం దేశరాజధాని దిల్లీలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. కేసులు, మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దిల్లీకి వెళ్లేందుకు ఎంపీలు విముఖంగా ఉన్నట్టు సమాచారం. ఫలితంగా ఈసారి సమావేశాలు జరగకపోవడానికి ఎక్కువ అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి:- హిందుత్వానికి అర్థం చెప్పిన ఫడణవీస్