గత 27 ఏళ్లలో ఎప్పుడూలేని పరిస్థితిని భారత్ ఎదుర్కొంటోంది. భారీ స్థాయిలో ఎడారి మిడతల దండు పశ్చిమ భారతాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకవైపు, మరోవైపు ఈ మిడతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మిడతల దండును అంతం చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. వేల ఎకరాల్లో పంట నాశనం కాకుండా, మిడతలను మట్టుపెట్టాడనికి అత్యాధునిక స్ర్పేయర్లు, డ్రోన్‌లను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలకూ పలు సూచనలు చేసింది. మిడతల బెడద ఎక్కువగా ఉన్న రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.
మిడతల దండును అంతం చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలివే!
- పంటలను నాశనం చేస్తున్న మిడతలను అంతం చేయడానికి యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి అదనంగా 60 స్ప్రేయర్లను కొనుగోలు చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చింది.
- ప్రస్తుత పరిస్థితుల్లో రిమోట్ పైలెటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను వినియోగించేందుకు కేంద్ర పౌరవిమానయానశాఖ నిబంధనలను సడలించింది. మిడతలపై రసాయనాలను పిచికారీ చేసే బాధ్యతను రెండు కంపెనీలకు అప్పగించనుంది. ఇప్పటికే ఆ కంపెనీలను ఖరారు చేశారు.
- మిడతల ప్రభావం అధికంగా ఉన్న రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్‌లు చేపడుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
- ఉత్తర్‌ప్రదేశ్‌లోని 17 జిల్లాలోని రైతులను ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఝాన్సీ, మహోబ, హమీపూర్, ఆగ్రా, అలీఘర్, మథుర, బులంద్‌సహర్, హత్రాస్, ఎతాహ్, ఫిరోజాబాద్, మెయిన్‌పురి, ఎతవాహ్, ఫరూకాబాద్, ఔరియా, జలన్, కన్పూర్, లతిపూర్ జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇప్పటికే ఝాన్సీలోని చాలా పంట పొలాలు మిడతలకు ఆహారం అయ్యాయి.
- రాజస్థాన్‌లోని బర్మార్, జోథ్‌పూర్, నాగౌర్, బికనేర్, గాంగార్, హనుమఘర్, సిర్కార్, జైపూర్, మధ్యప్రదేశ్‌లోని సత్నా, గ్వాలియర్, సీథి, రాజ్‌ఘర్, బైతులా, దేవాస్, ఆగ్రా మాల్వాల జిల్లాల్లో ఉన్న మిడతల దండులు చిన్నవని, అవి గుడ్లు పెట్టే దశకు రాలేదని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ తెలిపింది. వాటిని అంతం చేయడమే ప్రధాన లక్ష్యమని తెలిపింది.
- మిడతల నియంత్రణకు 200 లోకస్ట్ సర్కిల్ ఆఫీస్‌లు సర్వే చేపడుతున్నాయని ప్రభుత్వం తెలిపింది.
- రాజస్థాన్ 21 జిల్లాలు, మధ్యప్రదేశ్‌లోని 18, గుజరాత్ 2, పంజాబ్‌లోని ఒక జిల్లాలో మిడతల నియంత్రణ ఆపరేషన్లు మొదలు పెట్టారు.
- 89 ఫైర్ బ్రిగేడ్‌ల ద్వారా పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. 120 సర్వే వాహనాలు, 47 ప్రత్యేక పిచికారీ వాహనాలు, 810 ట్రాక్టర్లను మిడతల నియంత్రణకు వాడుతున్నారు.
- గతేడాది తూర్పు ఆఫ్రికాలో భారీగా పుట్టుకొచ్చి మిడతల అక్కడి నుంచి సౌదీ అరేబియా, ఇరాన్, పాకిస్థాన్లకు చేరాయి. ఇప్పుడు భారతదేశంలో పంటలపై దాడికి తెగబడ్డాయి.
ఇదీ చదవండి: మిడతలపై ఉమ్మడి పోరు