దేశవ్యాప్తంగా ఉన్న మిలటరీ క్యాంటీన్లలో 'మేడ్-ఇన్-ఇండియా' ఉత్పత్తులను మాత్రమే అమ్మాలనే నిర్ణయాన్ని రక్షణశాఖ తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలంటూ ప్రధానమంత్రి పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా, రక్షణశాఖ కేవలం దేశీయంగా తయారైన ఉత్పత్తులనే క్యాంటీన్లలో అమ్ముతోందా? అని పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్నకు రక్షణశాఖ సహాయమంత్రి శ్రీపాద నాయక్ రాజ్యసభలో సమాధానమిచ్చారు. ఇప్పటివరకు అలాంటి నిర్ణయమేమి తీసుకోలేదని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా ఉన్న మిలటరీ క్యాంటీన్ల 2019-20వార్షిక టర్నోవర్ రూ.17,588 కోట్లుగా ఉన్నట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది. 2017-18లో ఇది రూ.17,190కోట్లు ఉండగా, 2018-19నాటికి రూ.18,917 కోట్లకు పెరిగినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.