దిల్లీలో నాలుగు నెలల ముందు తప్పిపోయిన 12 ఏళ్ల బాలికను గూగుల్ మాప్స్ సహాయంతో ఆ రాష్ట్ర పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.
మతిస్థిమితం లేని పరిస్థితిలో..
బాలిక మార్చి 21 హోలీ రోజున దిల్లీలోని కీర్తి నగర్లో ఓ ఆటో ఎక్కింది. ఎక్కడికి వెళ్లాలో చెప్పలేని స్థితిలో ఉన్న బాలికను ఆటో డ్రైవర్ పోలీసులకు అప్పగించాడు. బాలికకు మతిస్థిమితం లేదని పోలీసులు గుర్తించారు. కొంత సేపు విచారించిన అనంతరం ఆ బాలిక గ్రామం ఖుర్జా అని, తండ్రి పేరు జీతన్ అని తెలుసుకున్నారు. ఆమె చెప్పిన వివరాలతో నాలుగు ప్రాంతాల్లో విచారించారు. కానీ ఎలాంటి ఫలితం దక్కలేదు.మరోసారి ఆ బాలికను విచారించారు పోలీసులు. ఆమె తన మామ పింటూతో కలిసి రైలులో ప్రయాణించానని, అతను వాష్‌రూమ్‌లో తన దుస్తులను తొలగించి పారిపోయాడని వివరించింది. అనంతరం ఆ బాలికపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని వైద్య పరీక్షల్లో తేలింది. పింటూపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
సహాయపడిన గూగుల్ మాప్స్...
బాలికను తన తల్లిదండ్రులకు అప్పగించడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. సరైన వివరాలు తెలుసుకునేందుకు బాలికను పలుమార్లు విచారించారు. ఈ నేపథ్యంలో తన తల్లి ఊరు పేరు సోన్బర్స అని వెల్లడించింది.
పోలీసులు గూగుల్ మాప్స్‌లో సహాయం పొంది ఉత్తరప్రదేశ్‌లోని సిద్దార్ధ్‌నగర్ జిల్లాలో సోన్బర్స, ఖుర్జా గ్రామాలు ఉన్నాయని గుర్తించారు. అనంతరం బాలికను తన తల్లిదండ్రులకు అప్పగించారు.
'పింటూ ఎవరో తెలియదు'
తన కూతురికి మతిస్థిమితం లేదని, ఆసుపత్రిలో చూపించటానికే దిల్లీ వెళ్లినట్టు బాలిక తండ్రి వివరించాడు. హోలీ రోజున బాలిక తప్పిపోయినట్లు వెల్లడించాడు. అయితే పింటూ పేరుతో తనకు బంధువులు లేరని బాలిక తండ్రి పోలీసులకు చెప్పాడు. తర్వాత పింటూపై కేసును కొట్టివేశారు పోలీసులు.
ఇదీ చూడండి:దయనీయం: నిరుద్యోగి 'డాక్టర్' ఆకలి వ్యథ!