కొత్త సంవత్సరంలో కేంద్రం రైతులకు శుభవార్త తీసుకొస్తోంది. రైతులకు నేరుగా నగదు బదిలీ చేసే పథకమైన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధులను జనవరి 2న మరోసారి విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. కర్ణాటకలోని తుమ్కూర్‌లో ప్రధాని మోదీ రూ. 12,000 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా సుమారు 6.5 కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. లబ్ధిదారులు నగదు పొందాలంటే డిసెంబర్ 1 నుంచి వారి బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానాన్ని తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.
దేశ వ్యాప్తంగా దాదాపు 14 కోట్ల మంది రైతులు ఈ పథకం పరిధిలోకి వస్తారని కేంద్రం అంచనా వేసింది. డిసెంబర్ 29 వరకు మొత్తం 9.2 కోట్ల మంది రైతుల వివరాలను సేకరించింది. అయితే ఈ పథకాన్ని బంగాల్ ప్రభుత్వం వ్యతిరేకించింది. రైతుల డేటాను నమోదు చేసేందుకు అక్కడి ప్రభుత్వం తిరస్కరించింది.
మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్ ఈ పథకాన్ని సమర్థంగా ఉపయోగించుకున్న రాష్ట్రంగా నిలిచింది. దాదాపు 2 కోట్ల మంది రైతులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు.
ఈ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి కేంద్రం రూ.6,000 ఆర్థిక సాయం అందించనుంది. వార్షిక బడ్జెట్‌లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకానికి కేంద్రం రూ.75,000 కోట్లు కేటాయించగా.. దాదాపు రూ.45,000 కోట్లు ఇప్పటికే ఆయా ఖాతాల్లో జమచేసింది.
ఇదీ చూడండి:'పౌరచట్టంపై అసెంబ్లీలకు హక్కులేదు.. పార్లమెంట్‌దే నిర్ణయం'