సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా బెంగళూరులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అమూల్య అనే యువతి రసాభాస సృష్టించింది. కార్యక్రమానికి హాజరైన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సమక్షంలో పాకిస్థాన్ అనుకుల నినాదాలు చేసింది.
యువతి తనతో పాటు నినాదాలు చేయాలని ప్రజలను కోరింది. దీంతో వేదికపై ఉన్న ఓవైసీ అప్రమత్తమై... యువతి చేతిలో ఉన్న మైక్ లాక్కోవడానికి ప్రయత్నించారు. ఆయనతో పాటు మరికొంత మంది కూడా స్టేజీపైకి చేరి యువతిని చుట్టుముట్టారు. అయినప్పటికీ యువతి పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడం ఆపలేదు.
అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు యువతిని పక్కకు తీసుకెళ్లారు. తర్వాత ప్రసంగించిన ఓవైసీ... యువతి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. యువతితో ఏకీభవించేది లేదని స్పష్టం చేశారు.
"నాకు గానీ నా పార్టీకి గానీ ఆ యువతితో సంబంధం లేదు. యువతి వ్యాఖ్యలను ఆక్షేపిస్తున్నాం. నిర్వాహకులు ఆమెను ఇక్కడికి ఆహ్వానించాల్సింది కాదు. ఈ విషయం తెలిస్తే నేనిక్కడికి వచ్చేవాడినే కాదు. మేము భారత్ కోసం ఉన్నాం. శత్రు దేశమైన పాకిస్థాన్‌కు మద్దతు ఇచ్చేది లేదు. భారతదేశాన్ని కాపాడటమే మా పూర్తి అభిమతం."
-అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం అధినేత
దేశ ద్రోహం కేసు
యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... ఐపీసీ సెక్షన్ 124ఏ ప్రకారం దేశద్రోహం కేసు నమోదు చేశారు. విచారణ తర్వాత కోర్టు ముందు హాజరు పరచనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.