ఉత్తర్‌ప్రదేశ్ ఘజియాబాద్ జిల్లాలోని ఇందిరాపురంలో షిప్రా సన్ సిటీ శివాలయంలో రోజూ కుప్పలు తెప్పలగా పుష్పాలు వస్తాయి. అయితే అవన్నీ వృథాగా సమీపంలో చెరువులో కలిసిపోతాయి. కొన్ని రోజులకు కుళ్లి దుర్వాసన వస్తుంది. దీనికి పరిష్కారంగా పూలతో బయోగ్యాస్ తయారు చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆలయ నిర్వాహకులు.
భక్తులు తెచ్చిన పూలు వృథా కాకుండా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఆలయ కమిటీ. దీని కోసం ఆలయ ఆవరణంలో బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. పర్యావరణహితంగా శాస్త్రీయ పద్ధతిలో పూలతో జీవఇంధనం, సేంద్రీయ ఎరువులను తయారు చేసి అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఆ బయోగ్యాస్‌ను ఆయలంలో ప్రసాదం తయారీకి వంటచెరుకుగా వినియోగిస్తున్నారు.
"ప్రతిరోజు చాలా పూలు వస్తాయి. ఈ పుష్పాలను పర్యావరణహితంగా మర్చాలనుకున్నాం. దీంతో జీవ ఇంధనం తయారు చేయాలని నిర్ణయించుకున్నాం."
- వినయ్ మిశ్రా, ఆలయ పూజారి
బయోగ్యాస్ ఇలా తయారు..
'పుష్పాలను పడేసే ప్రదేశంలో బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశాం. దానిలో వృథా పూలను వేస్తే 24 గంటల వ్యవధిలో సేంద్రియ ఎరువుగా మారుతుంది. కుళ్లిన వ్యర్థాల నుంచి ఉత్పన్నమయ్యే వాయువును ప్లాంట్ మీద ఏర్పాటు చేసిన గ్యాస్ ట్యాంక్‌లోకి సేకరిస్తాం' అని బయోగ్యాస్ పనితీరును వివరించారు వినయ్.
"శివుడికి సమర్పించే పాలు, పుష్పాలు నదుల్లో కలిసి కాలుష్యానికి కారణమవుతున్నాయి. దీనిపై ఆలయ కమిటీ సమావేశమై చర్చించింది. చివరిగా బయో గ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఆ బయోగ్యాస్‌ను ఆలయంలో ప్రసాదం వండటానికి ఉపయోగిస్తున్నాం"
- రవీంద్రనాథ్ రాయ్, ఆలయ ధర్మకర్త
ఇదీ చూడండి: మరో కీలక టన్నెల్ నిర్మాణంపై కేంద్రం దృష్టి!