రెండు రోజుల పర్యటనలో భాగంగా జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ నిన్న రాత్రి దిల్లీకి చేరుకున్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆమెకు స్వాగతం పలికారు. వాణిజ్యం, ఇంధనం, రక్షణ వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసే దిశగా ప్రధాని నరేంద్రమోదీతో నేడు మెర్కెల్ చర్చలు జరపనున్నారు.
రాష్ట్రపతి భవన్లో జరిగే స్వాగత కార్యక్రమంలో ఏంజెలా పాల్గొంటారు. అనంతరం రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు.
"ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక సంబధాలు మరింత బలోపేతమవుతున్నాయి. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్.. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా దిల్లీ చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు 5వ- ఐజీసీ ( ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్)కి మెర్కెల్ సహ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఏడాది లోపల ఇరువురు అగ్రనేతల మధ్య ఇది అయిదవ భేటీ." - రవీష్ కుమార్, విదేశాంగ అధికార ప్రతినిధి
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సాయంత్రం భేటీ అవుతారు మెర్కెల్. లోక్‌కల్యాణ్ మార్గ్‌లో ఉన్న మోదీ నివాసంలో ప్రధానితో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య దాదాపు 20 ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇరువురు అగ్రనేతల మధ్య కశ్మీర్ అంశం చర్చకు వస్తుందా లేదా అనే విషయంపై జర్మనీ రాయబారి స్పందించారు. వారి మధ్య ఎలాంటి విషయమైన చర్చకు వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే కశ్మీర్‌పై ఐరోపా సమాఖ్య అభిప్రాయానికి తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.
ఏంజెలా మెర్కెల్ వాణిజ్య బృందంతో శనివారం సమావేశమవుతారు. గురుగ్రామ్ మానేసర్‌లోని కాంటినెంటల్ ఆటోమేటివ్ కంపోనెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను సందర్శిస్తారు.
- ఇదీ చూడండి: సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామిగా 'భారత్'