అహింసా మార్గాన్ని ప్రపంచానికి చూపిన యుగపురుషుడు మహాత్మా గాంధీ జయంతి నేడు. ప్రపంచ రాజకీయాల గతిని మార్చిన మానవ శ్రేష్ఠుడు ప్రపంచ శాంతికి నిర్దేశించిన అహింసా మంత్రాన్ని గుర్తు చేసుకునే రోజు. సత్య నిష్ఠతో కర్కశమైన పాలకుల గుండెను కరిగించిన ఆ ఉక్కు సంకల్పం ముందు.. ఇనుప తూటాలు నిశ్చేష్టలై నిలుచుండి పోయాయి. 'భారతవనిలో చైతన్య దీప్తిని వెలిగించిన మీరు చూపిన మార్గమే మాకు శరణ్యం బాపూ' అంటూ జాతి యావత్తు నేడు మహాత్ముడిని స్మరిస్తోంది.
సబర్మతిలో మోదీ..
మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్ అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. అక్కడ జాతిపితకు ఘన నివాళులు అర్పించనున్నారు ప్రధాని.
అనంతరం సబర్మతి నది సమీపంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. ఇదే వేదికగా భారత్‌ను బహిరంగ మల మూత్ర విసర్జన రహిత దేశం(ఓడీఎఫ్)గా ప్రకటిస్తారు మోదీ.
దేశవ్యాప్తంగా కార్యక్రమాలు..
మహాత్ముడి జయంతిని అట్టహాసంగా నిర్వహిస్తోంది కేంద్రం. జాతి యావత్తు బాపూ స్మరణతో 'వైష్ణవ జనతో' రాగాలాపనలతో నిండనుంది. కేంద్రమంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఘనంగా జాతిపిత జయంతి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఇదీ చూడండి: గాంధీ ప్రత్యేకం: దృఢ సంకల్పంతో సాధించిన విజయాలెన్నో..