ఓ వైపు ప్రకృతి విపత్తులు.. మరోవైపు కాలుష్య కాసారాలు.. ఈ పరిస్థితి నుంచి బయటపడటం ఎలా..? ఈ ప్రశ్నకు 70 ఏళ్ళ క్రితమే మహాత్ముడు సమాధానం చెప్పారు. ఆయన ఆలోచనా సరళిని ప్రపంచం కాదు కదా.. కనీసం భారతదేశం సైతం పాటించలేదు. ఇంతకీ గాంధీజీ సూచించిన పర్యావరణహిత అభివృద్ధి నమూనా ఏంటి..?
అప్పుడు ఏం లేవు..
మహాత్మాగాంధీ జీవించిన కాలంలో వాతావరణ మార్పులు, పర్యావరణానికి ముప్పు అంటే ఏమిటో తెలియదు. అది అప్పుడు పెద్ద సమస్య కాదు. అందుకే.. వాతావరణ మార్పులపై గాంధీజీ ఆందోళన చెందినట్టు మనకు ఎక్కడా కనిపించదు. అయితే.. మహాత్ముడి జీవితం పర్యావరణానికి అనుకూలమైనది. పర్యావరణ పరిరక్షణ, ప్రకృతిని నాశనం చేయకపోవడం.. ఆయన జీవన విధానం.
పర్యావరణ హితం..
మహాత్ముడు మాత్రమే కాదు.. ఆయన అనుచరులు సైతం.. ప్రకృతికి లోబడే జీవించేవారు. సబర్మతి, సేవాగ్రామ్ ఆశ్రమాల్లో గాంధీతో కలిసి జీవించే వ్యక్తులు కొన్ని ప్రమాణాలకు కట్టుబడి వ్యవహరించేవారు. ఆశ్రమ నియమనిబంధనలు అలా ఉండేవి. ప్రత్యర్థులను సైతం దయతో చూడటమే ఆశ్రమ నియమం. అహింస.. ప్రతిజ్ఞ అన్ని జీవులతో పాటు విరోధులకు వర్తిస్తుంది.
గాంధీ దృష్టిలో ఆవును రక్షించడమంటే ఒక జంతువును గౌరవించడం. ఆవు దూడలకు దక్కాల్సిన పాలను తీసుకోవడాన్ని కూడా మహాత్ముడు సున్నితంగా తిరస్కరించేవారు. ఆరోగ్య కారణాల రీత్యా వైద్యులు, భార్య కస్తూర్బా ఒత్తిడి మేరకు మేక పాలు తీసుకోవడానికి ఆయన బలవంతంగా అంగీకరించారు. బ్రహ్మచర్యంపై ప్రతిజ్ఞ చేసిన వ్యక్తి ఆలోచనల్లోనూ కోరికలను నియంత్రించుకోవాలని నిర్దేశిస్తుంది. నోటిని అదుపులో పెట్టుకోవాలని గాంధీజీ సూచించారు.
ఎంత కావాలో అంతే...
మనిషి తనకు ఎంత అవసరమో అంతే తీసుకోవాలన్నారు. అవసరం లేని దానికన్నా అధిక వస్తువులు కలిగి ఉండటం దొంగతనంతో సమానమని బాపూజీ భావించారు. ప్రకృతి ద్వారా అవసరాలు తీర్చుకోవాలి. అంతకుమించి ఆశించవద్దని స్పష్టం చేశారు. వీలైనంత వరకు ప్రకృతి ఇచ్చిన దానితో సరిపెట్టుకోవాలన్నది గాంధీజీ సిద్ధాంతం.
మహాత్ముడు సరళమైన జీవితాన్నే విశ్వసించారు. ప్రకృతి వనరులపై అధికంగా ఆధారపడటం మంచిది కాదని సూచించారు. వనరులను సముచితంగా ఉపయోగించుకున్న గాంధీజీ.. వృథా ఎన్నడూ చేయలేదు.
యంత్రాల వ్యతిరేకి...
తన స్వదేశీ సిద్ధాంతంలో భాగంగా.. పారిశ్రామిక ఉత్పత్తులను వాడటాన్ని గాంధీజీ వ్యతిరేకించారు. అలా చేస్తే.. చేతి వృత్తిదారులకు అన్యాయం చేసినట్లేనని భావించారు. అధునాతన తయారీ యంత్రాల ద్వారా ఉత్పత్తైన వస్తువులను బహిష్కరించాలని గాంధీజీ పిలుపునిచ్చారు. దేశీయ చేనేత వస్తువులను బాపూజీ ఉపయోగించారు.
యంత్రాల వాడకాన్ని మహాత్ముడు తీవ్రంగా వ్యతిరేకించారు. బ్రిటిష్ యంత్రాలను ఉపయోగించే భారత దేశం కంటే.. బ్రిటిష్ మార్కెట్‌పై ఆధారపడే దేశానికే ప్రాధాన్యత ఇచ్చారు. దేశంలో మాంచెస్టర్ కర్మాగారాలను స్థాపించడం కంటే.. మాంచెస్టర్‌లో తయారైన వస్తువులను కొనడమే మంచిదన్నారు. యంత్రాలు వాడితే పాపం చేసినట్లే నని భావించారు. వాటితో వచ్చిన డబ్బు లైంగిక అనైతికం కంటే నీచమైనదన్నారు.
గాంధీజీ అభివృద్ధి ఆలోచన ప్రకృతిని దోపిడీ చేయదు. ఎందుకంటే.. మనం ఉపయోగించే అనేక యంత్రాలు ఆయన విధానంలో లేవు. ఆటోమొబైల్ తదితర యంత్ర తయారీ పరిశ్రమలు అత్యంత కాలుష్య కారకాలు. కర్బన్ ఉద్గారాలను విడుదల చేస్తాయి. ఇది పర్యావరణానికి ముప్పుగా తయారయింది. దురదృష్టవశాత్తూ.. మహాత్ముడు ఆలోచనలను ప్రపంచం అనుసరించలేదు. ఆయన సూచనలకు పూర్తి విరుద్ధంగా అభివృద్ధి సాగింది.
కాలుష్యంలోనూ పోటీ..
దేశ అభివృద్ధి అంతా గందరగోళం మధ్య సాగుతోంది. గాంధీ ఆలోచనలకు వ్యతిరేకంగా నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్.. ఆయన ముఖ్య అనుచరుడు అహ్లూవాలియా తీసుకువచ్చిన నయా ఉదారవాద విధానాలు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాయి. 2007-08లో ఐక్యరాజ్యసమితి మానవ అభివృద్ధి నివేదికను విడుదల చేసింది. 2050 నాటికి కర్బన్ ఉద్గారాలను 80 శాతం తగ్గించాలని సూచించింది.
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్, చైనా 20 శాతం కర్బన్ ఉద్గారాల తగ్గింపును లక్ష్యంగా పెట్టుకోవాలని వివరించింది. కార్బన్‌డై ఆక్సైడ్, గ్రీన్‌హౌస్ ఉద్గారాల వల్ల.. ఆరోగ్యం ప్రమాణాల మెరుగుదల, పేదరికం తగ్గింపు పురోగతిలో తిరోగమనానికి దారితీస్తుందని హెచ్చరించింది. ఈ నివేదికను నాటి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా తోసిపుచ్చారు.
పర్యావరణ కాలుష్యానికి ఏ దేశం ఎంతవరకు కారణమనే విషయాన్ని ఈ నివేదిక తేల్చలేదని ఆయన ఆరోపించారు. ఏడాదికి 20 టన్నుల కార్బన్‌డై ఆక్సైడ్‌ను అమెరికా విడుదల చేస్తుంది. అలాంటి దేశం 80 శాతం ఉద్గారాలను తగ్గించుకుంటే.. 3 టన్నులకు చేరుకుంటుందని అహ్లూవాలియా వివరించారు. భారతదేశం కేవలం కోటీ 20 లక్షల టన్నుల కార్బన్‌డై ఆక్సైడ్ విడుదల చేస్తుందని పేర్కొన్నారు. అలాంటి దేశం 80 శాతం ఉద్గారాల విడుదలను తగ్గించున్నప్పటికీ పెద్దగా ప్రభావం ఉండదన్నారు. అది 80 లక్షల టన్నులకే పరిమితమవుతుందని వాదించారు. భారతదేశంలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు మాత్రమే సూచనలు ఇవ్వడం సరికాదన్నారు.
ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం... అమెరికా మాదిరిగా ప్రపంచమంతా విలాసవంతమైన జీవితానికి అలవాటుపడితే.. కాలుష్యం బారినపడకుండా జీవించడానికి 9 గ్రహాలు కూడా సరిపోవు. మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా వాదన ఇలాగే ఉంది. మహాత్మాగాంధీ సూచనలను విస్మరించి.. అభివృద్ధి చెందిన దేశాలను ఆదర్శంగా తీసుకుంటే.. కాలుష్య కారకాల ఉత్పత్తిలో భారతదేశం అగ్రరాజ్యాల సరసన నిలుస్తుంది. ఇప్పటికీ అభివృద్ధి అంటే అమెరికాను అనుసరించాలనే అపోహ నుంచి బయటపడాలి.
ఆదర్శంగా భూటాన్...
మన్మోహన్‌సింగ్ హయాంలో జరిగిన అభివృద్ధి పథానికి బదులుగా.. గాంధీజీ సూచించిన విధానంలో సాగితే.. యువతకు ఎక్కువ ఉపాధి లభించేది. అభివృద్ధి స్థిరంగా సాగేది. పర్యావరణానికి అనుకూలంగా ఉండేది. అభివృద్ధి విషయంలో ప్రపంచదేశాలకు భూటాన్ ఆదర్శంగా నిలుస్తోంది. స్థూల జాతీయోత్పత్తి కంటే.. స్థూల జాతీయ ఆనందం- జీఎన్‌హెచ్ ముఖ్యమని ప్రకటించి సాహసోపేతంగా వ్యవహరించింది. జీఎన్‌హెచ్ సంపూర్ణమైన, స్థిరమైన ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. ఆర్థికేతర సూచికలకు సైతం ప్రాముఖ్యత ఇస్తుంది. ఆనందానికి అర్థం ఆర్థికంగా బాగుండటం మాత్రమే కాదు.
సాంస్కృతిక, పర్యావరణ వైవిధ్యం, కష్టాలను ఎదుర్కొనే తీరు.. తదితర సూచికల్లో.. భూటాన్ ఆదర్శంగా నిలుస్తోంది. పాశ్చాత్య అభివృద్ధి ఆలోచనను తిరస్కరించిన మాహాత్ముడు.. చెప్పదలచుకున్నది కూడా ఇదే విషయం. భూటాన్ సాధించిన అభివృద్ధి గాంధీ ఆలోచనలకు అనుగుణంగా ఉంది. హిందూ స్వరాజ్ రచనల ద్వారా మహాత్ముడు తన ఆలోచనలను కష్టంగానైనా.. చాలా స్పష్టంగా తెలిపారు. అయితే.. తన ముఖ్య అనుచరులైన జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్.. స్వాతంత్ర్యం తర్వాత పరిస్థితులకు తగ్గట్లు వ్యవహరించారు... కానీ గాంధీజీ అభివృద్ధి నమునాను అనుసరించలేదు.
వాతావరణ సంక్షోభ ఫలితాలను అనుభవిస్తున్న ప్రపంచం .. మహాత్ముడి ఆలోచనసరళిని క్రమంగా అర్థం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. మన భవిష్యత్ మనుగడ.. ఆ ఆలోచనలను ఎంత త్వరగా అమలు చేస్తామని అంశంపై ఆధారపడి ఉంది.
ఇదీ చూడండి:గాంధీ 150: దేశ విభజనలో మహాత్ముడి పాత్ర ఎంత?