జస్టిస్ బి.ఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అనిరుద్దా బోస్, జస్టిస్ ఏ.ఎస్.బోపన్నలు సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. 27గా ఉన్న సుప్రీం న్యాయమూర్తుల సంఖ్య వీరి రాకతో 31కి చేరింది.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బుధవారం ఈ నలుగురు న్యాయమూర్తులకు నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
జస్టిస్ అనిరుద్దా బోస్, జస్టిస్ ఏ.ఎస్. బోపన్నల పేర్లను ఇంతకుముందే కొలీజియం ప్రతిపాదించగా వారి నిజాయితీ, ప్రాంతాల ప్రాతినిధ్యం కారణాలుగా చూపించి కేంద్రం తిప్పి పంపించింది. ఈ అభ్యంతరాలను మే 8న తోసిపుచ్చిన కొలీజియం పదోన్నతికి యోగ్యతే ప్రధానమని అభిప్రాయపడింది. వీరిద్దరితో పాటు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ పేర్లను కొత్తగా ప్రతిపాదించింది కొలీజియం.
జస్టిస్ అనిరుద్దా బోస్ ఇప్పటివరకు ఝార్ఖండ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. అఖిల భారత న్యాయమూర్తుల సీనియారిటీలో 12వ స్థానంలో ఉన్నారు. జస్టిస్ ఏఎస్ బోస్ గువహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. సీనియారిటీలో 36వ స్థానంలో ఉన్నారు.
జస్టిస్ బీఆర్ గవాయ్ బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. జస్టిస్ సూర్యకాంత్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇప్పటివరకు బాధ్యతలు నిర్వర్తించారు.
- ఇదీ చూడండి: అడ్వాణీకి ప్రధాని మోదీ పాదాభివందనం