ఝార్ఖండ్‌లోని హజారిభాగ్ జిల్లా ఉచ్ఛాధానా మిలన్ తండాకు చెందిన మహేష్ కర్మాలీ ఓ రైతు. తనకు ట్రాక్టర్‌తో పొలం దున్నించాలంటే ఖర్చుతో కూడుకున్న పని. పశుపోషణ కూడా భారమైపోయింది. తన 3 ఎకరాల పొలంలో సాగు చేసేందుకు ఎలాగైనా తక్కువ ఖర్చుతో పనయ్యేలా దున్నుడు యంత్రం తయారు చేయాలనుకున్నాడు. చదువు లేకపోయినా తన ఆలోచనకు పదును పెట్టి ఇరుగు పొరుగు అన్నదాతలకు ఓ పరిష్కారం చూపాడు.
అనుకున్నట్టుగానే అతి తక్కువ ఖర్చుతోనే దున్నే యంత్రాన్ని తయారుచేశాడు. పాత స్కూటర్ ఇంజిన్, ఇతర భాగాలతో పొలం దున్నే యంత్రాన్ని తయారు చేశాడు. 3 ఎకరాలు వ్యవసాయ భూమి ఉన్నా.. వచ్చిన ఆదాయమంతా పెట్టుబడులకే సరిపోతోందని ఈ ఉపాయం చేశాడు ఆ యువరైతు. పొలం దున్నేందుకు పశువులు, ట్రాక్టర్లకు పెట్టే ఖర్చుతో పోలిస్తే ఈ యంత్రంతో అయ్యే ఖర్చు చాలా తక్కువ.
" ఈ ఆలోచన రావడానికి నా పేదరికమే కారణం. నా దగ్గర ఆవులు ఎడ్లూ ఏమీ లేవు. వ్యవసాయ భూమి ఉంది. ఈ యంత్రాన్ని తయారు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత పేదరికంలోనూ ఈ యంత్రాన్ని తయారు చేసినందుకు నా మీద నాకు విశ్వాసం పెరిగింది. ఇప్పుడు నాకు అవసరమున్నప్పుడు పొలంలో వాడుతాను, పని అయ్యాక దాచేస్తాము."
-మహేశ్ కర్మాలీ, రైతు
ఎకరా పొలం దున్నాలంటే దాదాపు రూ.1,500/- నుంచి రూ.1,600/- వరకు ఖర్చవుతుంది. ఈ యంత్రంతో కేవలం రూ.400/- నుంచి రూ. 500/-తో పని అయిపోతుందంటున్నాడు మహేశ్ కర్మాలీ.
నాగలి అమర్చిన ఈ ద్విచక్ర వాహనానికి మోటారు బిగించి యంత్రాన్ని తయారు చేశాడు మహేశ్. ఒక్కరే సులభంగా పొలం దున్నుకునేలా ఉన్న ఈ యంత్రం ఎందరో రైతుల కష్టాలు తీరుస్తోందంటున్నారు తోటి రైతన్నలు. అయితే.. ఈ యంత్రంతో బురదలో దున్నడం కొంచెం కష్టమే అయినా పొడి నేలలో చకచకా దున్నేయొచ్చు. ప్రభుత్వం ఇలాంటి యంత్రాలు తయారు చేసి రైతులకు అందిస్తే వ్యవసాయ రంగం మరింత వృద్ధి చెందుతుందంటున్నారు.
"జంతువులు, ట్రాక్టర్లు ప్రతి రైతు కొనలేడు. ఈ యంత్రం చాలా తక్కువ ధరకే లభిస్తుంది. దీని ఖరీదు రూ. 10 వేల నుంచి 12 వేల మధ్యనే ఉంది. ప్రభుత్వం కూడా దీనిని తయారు చేసి రైతులకు ఇస్తే బాగుంటుంది. మహేశ్ చాలా మంచి పని చేశాడు. రైతులంతా ఆయనను ఆశీర్వదిస్తున్నారు."
- శైలేంద్ర, రైతు.
తన కష్టం తీర్చుకుందామని తయారు చేసిన వినూత్న యంత్రం ఇప్పుడు దేశంలో సన్నకారు రైతులకు ఓ మార్గాన్ని నిర్దేశించింది. సంకల్పిస్తే సమస్య ఏదైనా పరిష్కారం లభిస్తుందని నిరూపించాడు అన్నదాత మహేశ్.