కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు లోక్సభ ఆమోదంపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక బిల్లులతో రైతుల, వ్యవసాయ రంగ సమస్యలను తొలగిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
అయితే, ఈ బిల్లుపై రైతులను తప్పుదోవ పట్టించేందుకు అనేక శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు మోదీ. ఈ బిల్లులకు వ్యతిరేకంగా భాజపా మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్.. విపక్షాలతో కలిసి నిరసన తెలిపిన నేపథ్యంలో ఈ మేరకు స్పందించారు.
"ఈ సంస్కరణలతో పంటల విక్రయంలో రైతులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వారికి లాభాలు పెరుగుతాయి. కనీస మద్దతు ధర అందిస్తూ వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు హామీ ఇస్తున్నా. అంతేకాకుండా రైతులకు ఇతర అవకాశాలను కూడా కల్పిస్తాం."
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
ఇప్పుడు రాజీనామా ఏంటి?
వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా ఓ నాటకమని కాంగ్రెస్ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్సులు జారీ చేసిన సమయంలో ఎందుకు స్పందించలేదని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ప్రశ్నించారు.
"ఆర్డినెన్సులకు కేబినెట్ ఆమోదించిన సమయంలో బాదల్ ఎందుకు వ్యతిరేకించలేదు. ఆమె రాజీనామా ఓ నాటకం. కేంద్ర కేబినెట్ నుంచి ఆమె వైదొలిగినా.. వారి పార్టీ ఇంకా సంకీర్ణంలోనే ఉంది. ఇది రైతుల కోసం చేసిన పనికాదు. సొంత రాజకీయ భవిష్యత్తును కాపాడునే చర్య. ఆమె చేసింది చాలా చిన్న పని. అదీ ఆలస్యంగా స్పందించారు."
- అమరీందర్ సింగ్
లోక్సభ ఆమోదం..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుల్లో రెండింటికి లోక్సభ గురువారం ఆమోదం తెలిపింది.
కేంద్రం తీసుకొచ్చిన బిల్లులు ఇవే..
- రైతులు తమ ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్ యార్డుల్లోనే విక్రయించాలన్న నిబంధనను తొలగిస్తూ తీసుకొచ్చిన ‘ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు-2020
- పంట వేయడానికి ముందే వ్యవసాయ ఉత్పత్తుల విక్రయంపై వ్యాపారులతో రైతులు చేసుకొనే ఒప్పందాలకు రక్షణ కల్పించే ‘ద ఫార్మర్స్ (ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫామ్ సర్వీసెస్ బిల్లు
ఇదీ చూడండి: రెండు వ్యవసాయ బిల్లులకు లోక్సభ ఆమోదం