కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్డౌన్ కారణంగా.. రోజుకో హోటల్ వంటకం రుచి చూసిన కొన్ని జిహ్వలు.. గత కొద్ది రోజులుగా చప్పబడిపోయాయి. కానీ ఏం చేస్తాం ఏది ముట్టుకుంటే కరోనా పట్టుకుంటుందో తెలీదని చాలామంది సర్దిచెప్పుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం ఆన్లైన్ ఆర్డర్లతో ఆహారాన్నే ఇంటికి తెప్పించుకుని.. కరోనాను బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కనిపెట్టేసిన మహమ్మారి వైరస్.. దిల్లీలోని ఓ పిజ్జా డెలివరీ బాయ్‌కి సోకింది. అతడితో పాటు 72 కుటుంబాలను నిర్బంధంలోకి నెట్టింది. ఇంకేముంది.. ఒక్క పాజిటివ్ కేసుతో ఫుడ్ డెలివరీ సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
తూర్పు దిల్లీ మాళవీయ నగర్‌కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ డెలివరీ బాయ్(19)కి కరోనా సోకింది. ప్రస్తుతం అతడు కలిసిన 72 కుటుంబాలను నిర్బంధంలో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఫలితంగా డెలివరీ బాయ్స్ పేరు వింటేనే హడలిపోతున్నారు దిల్లీ వాసులు. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టుకుని ప్రమాదాన్ని కొనితెచ్చుకోవద్దని ప్రజలను కోరుతున్నాయి సంక్షేమ సంఘాలు.
" సోదరా.. కొద్ది రోజుల పాటు ఇంటి వంటతోనే సరిపెట్టికో. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని అనవసరంగా నిర్బంధంలోకి వెళ్లడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఈ విషయాన్ని మేము వాట్సాప్ గ్రూపుల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. కానీ, వైరస్ వ్యాప్తిని ఎలా అరికట్టాలో అర్థం కావట్లేదు. ప్రభుత్వం చొరవ తీసుకుంటే బావుంటుంది."
- బీఎస్ వోహ్రా, స్థానికుల సంక్షేమ సంఘం ప్రతినిధి
'జాగ్రత్తలు తీసుకుంటాం నమ్మండి'
ఫుడ్ డెలివరీ బాయ్‌కు కరోనా సోకడం.. ఆహార వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఇప్పటికే ఈ రంగం దారుణంగా దెబ్బతింది. ఫలితంగా తమ వ్యాపారాలను కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు వ్యాపారులు. అంతేకాకుండా జాగ్రత్తలు పాటిస్తున్నట్లు వినియోగదారులకు పూర్తి భరోసా ఇస్తున్నారు. కొన్ని ఫుడ్ డెలివరీ సంస్థలైతే ఏకంగా.. యాప్‌లోనే డెలివరీ బాయ్ శరీర ఉష్ణోగ్రతను చూసేలా.. సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చాయి.
"ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకొని మేము కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకున్నాం. మా సిబ్బందిని చాలా జాగ్రత్తగా అత్యంత పరిశుభ్ర వాతావరణంలో ఉంచుతున్నాం. హోటల్లోనే వారిని క్వారంటైన్లో ఉండేలా చేశాం. "
-ద బ్లూ హోటల్ డైరెక్టర్.
ఆహార డెలివరీ సంస్థలు.. తమ డెలివరీ బాయ్స్‌కు కరోనా జాగ్రత్తలు పాటించేలా పూర్తి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపాయి. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించేలా చూస్తున్నామని చెప్పారు.
"మా సంస్థ సేవలందించే 50 వేలకు పైగా రెస్టారెంట్లలలో పూర్తి శానిటైజేషన్ అమలవుతోంది. మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. " అంటూ వినియోగదారులకు ధైర్యం చెబుతోంది జొమాటో.
ఇదీ చదవండి: మోదీ లాక్డౌన్-2 ప్రసంగం సూపర్‌హిట్.. టీవీల్లోనే 20 కోట్ల వీక్షణలు