దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించాలని నగర, పురపాలక సంస్థల అధికారులకు సూచించింది కేంద్రం. కరోనా కట్టడికి పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహణ, నిరంతర నిఘాపై దృష్టి సారించాలని కోరింది.
మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్, హరియాణా, గుజరాత్, జమ్ముకశ్మీర్, కర్ణాటక, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్లోని 38 జిల్లాల్లోని 45 నగర, పురపాలక సంస్థల పరిధిలోనే అత్యధిక కేసులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో వైరస్ కట్టడి చర్యలపై జిల్లా పాలనాధికారులు, స్థానిక కమిషనర్లు, జిల్లా ఆస్పత్రుల అధినేతలు, వైద్య కళాశాలల ప్రధానోపాధ్యాయులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్. పట్టణాల్లో వైరస్ వ్యాప్తి, ఇంటింటి సర్వే ప్రాముఖ్యం, పెద్దఎత్తున నిర్ధరణ పరీక్షలు, రోగుల చికిత్స, వైరస్ కట్టడి వ్యూహం వంటి అంశాలపై చర్చించారు.
" లాక్డౌన్ ఆంక్షలు సడలించిన క్రమంలో భవిష్యత్తులో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లాల వారీగా సరైన ప్రణాళిక రూపొందించాలి. కంటెయిన్మెంట్, బఫర్ జోన్లలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు సరైన జాగ్రత్తలు, పటిష్ఠ చర్యలు చేపట్టాలి. "
- ప్రీతి సుడాన్, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి.
మరణాల రేటును తగ్గించేందుకు ప్రధానంగా అధిక ప్రమాదం ఉన్నవారు, వయస్సుపైబడిన, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారిపై దృష్టి సారించి, తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేసినట్లు తెలిపారు సుడాన్. ఆయా ప్రాంతాల్లోని వైద్య ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతులు, పడకలు సహా మానవ వనరుల కొరత తలెత్తకుండా చూడాలన్నారు.
ఇదీ చూడండి: ఆ రెండు రాష్ట్రాల్లో మళ్లీ పూర్తిస్థాయి లాక్డౌన్