జీఎస్టీ మండలి 36వ సమావేశం నేడు జరగనుంది. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సభ్యులతో మాట్లాడనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జరగనున్న తొలి జీఎస్టీ మండలి భేటీ ఇదే.
పన్ను రేట్ల సవరణ!
ఈ సమావేశంలో విద్యుత్తు వాహనాలు, సోలార్ పవర్ ప్రాజెక్టులపై పన్ను తగ్గింపు, లాటరీలపై జీఎస్టీ రేట్ల సవరణ వంటి నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు. బడ్జెట్‌లో విద్యుత్ వాహనాలపై రాయితీలను ప్రకటించారు ఆర్థిక మంత్రి. కొన్ని రకాల విడిభాగాలపై కస్టమ్స్ సుంకాలను తగ్గించారు.
ఈ సారి సమావేశంలో విద్యుత్తు వాహనాలపై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గిస్తారని భావిస్తున్నారు. లాటరీలపై అటార్ని జనరల్ సలహా తీసుకొని పన్ను రేట్లను సవరించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహించే లాటరీలపై 12శాతం, ప్రభుత్వ గుర్తింపుతో నడిచే లాటరీలపై 28శాతం జీఎస్టీ విధిస్తున్నారు.
నేటికి వాయిదా
ఈ భేటీ గురువారం జరగాల్సి ఉన్నా నిర్మలా సీతారామన్‌కు తీరిక లేని కార్యకలాపాల మధ్య నేటికి వాయిదా పడింది.
ఇదీ చూడండి: త్వరలో మరో 20-25 విమానాశ్రయాల ప్రైవేటీకరణ