కర్ణాటకలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు తోడు ఎగువన మహారాష్ట్రలోని ఆనకట్టల గేట్లు ఎత్తివేయటం వల్ల రాష్ట్రంలోని నదులు ఉప్పొంగుతున్నాయి.
మహారాష్ట్రలోని కోయనా డ్యాం నుంచి కృష్ణా నదికి భారీగా వరద నీరు చేరింది. మార్కండేయ, ఘటప్రభ, మలప్రభ, భీమా నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నదుల పరీవాహక ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. బెళగావి జిల్లా హోస్కోటేలో గోడ కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు.
11 జిల్లాల్లో..
రాష్ట్రంలోని 11జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయి. పలు చోట్ల నేల కోతకు గురవడం వల్ల రోడ్లు, రైలు వ్యవస్థ ధ్వంసమైంది.
బెళగావిలో 4వ నెంబర్ రహదారి కోతకు గురైన కారణంగా బెంగళూరు-పుణె బస్సు సర్వీసులను నిలిపివేసింది ప్రభుత్వం. లోండా, తినాయి ఘాట్ వైపు రైలు సేవలను రద్దు చేసింది నైరుతి రైల్వే.
సహాయక చర్యలు ముమ్మరం
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఉత్తర కర్ణాటకలోని కద్రా డ్యాం సమీపంలో వరదల్లో చిక్కుకున్న 500 మందిని సైన్యం కాపాడింది.
ఇదీ చూడండి: -మహారాష్ట్ర వరదలు: నీట మునిగిన కొల్హాపుర్