అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఫలితంగా ఇప్పటివరకు వరదల్లో చిక్కుకొని 20 మంది మరణించారు. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో 22 జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయి.
"రాష్ట్రంలో సుమారు 2వేలకు పైగా గ్రామాలను వరద ముంచెత్తింది. ఇప్పటివరకు 9.67 లక్షల మందిపై తీవ్ర ప్రభావం పడింది."
-అసోం విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ
వరద బాధితులకు సాయం అందించేందుకు 11 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వీటిలో ఇప్పటివరకు మొత్తం 28,308 మంది ఆశ్రయం పొందారు. వరదల కారణంగా 98,850 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.
పెరుగుతున్న నీటి మట్టం
నదుల్లో నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతున్నట్లు సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదికలు వెల్లడించాయి. నిమతి ఘాట్, తేజ్పూర్, గువహటి, అబ్దూరి, సెనిమరి తదితర ప్రాంతాల్లో బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జియాబరేలీ, ధన్సిరి, కోపిలి, పగ్నాడియా నదుల్లోనూ వరద ఉద్ధృతి తీవ్రమైనట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:అసోంలో వరదల బీభత్సం.. 14 మంది మృతి